22-04-2025 12:57:45 AM
హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): హరేకృష్ణా మూవ్ మెంట్, హైదరాబాద్‌కు చెందిన సాంస్కృతిక విభాగం సుమేధసా (సంస్కృతి ద్వారా మేధస్సు) వేసవి సెలవుల సందర్భంగా సమ్మర్ కల్చర్ క్యాంప్ నిర్వహించనుంది. సోమవారం హరేకృష్ణా గోల్డెన్ టెంపుల్, బంజారాహిల్స్‌లో నిర్వహించిన కార్యక్రమంలో హరేకృష్ణ మూవ్‌మెంట్ ప్రెసిడెంట్, శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస్ ప్రభు క్యాంప్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన శిబిరం గురించి వివరించారు.
ఏప్రిల్ 24 నుంచి మే 17 వరకు కొనసాగనున్న ఈ ప్రత్యేక శిబిరం 6 నుంచి 16 ఏళ్ల పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ 21 రోజుల శిక్షణా కార్యక్రమంలో భారతీయ సంప్రదాయ కళలు, ఆధ్యాత్మిక విద్య, మనోవికాసాన్ని పెంపొందించే కార్యక్రమాలు ఉన్నాయి. పిల్లలు శారీరక, మానసిక, సాంస్కృతిక అభివృద్ధికి దోహదపడే పలు అంశాలలో శిక్షణ పొందగలుగుతారు. శిబిరంలో పూజా విధాన శిక్షణ, మంత్ర ధ్యానం, శ్లోక పఠనం, కృష్ణుడి భక్తి గీతాలు, వేదాల ఆధారిత కథలు, అగ్నిలేని వంటలు, యోగిక్ గేమ్స్, బహిరంగంగా మాట్లాడే నైపుణ్యాలు వంటి అంశాలపై శిక్షణ ఇస్తారు.
మెగా టాలెంట్స్ డే చివరి రోజున పిల్లలు తమ ప్రతిభను ప్రదర్శించే వేడుక, హరేకృష్ణా మూవ్‌మెంట్ ప్రెసిడెంట్, సత్యగౌర చంద్రదాస్ ప్రభు (ఎంటెక్, ఐఐటీ చెన్నై) సందేశం ఉంటుంది. శిక్షణ అనంతరం పిల్లలకు సర్టిఫికెట్లను అందజేయనున్నారు. హరేకృష్ణా గోల్డెన్ టెంపుల్, బంజారాహిల్స్, హరేకృష్ణా హెరిటేజ్ టవర్, కోకాపేట్, శ్రీశ్రీ రాధా కృష్ణ మందిరం, కంది సంగారెడ్డిలో శిబిరాలు నిర్వహించనున్నారు. రిజిస్ట్రేషన్ కోసం తమ వెబ్‌సైటన్ సందర్శించాలని చెప్పారు. వివరాల కోసం 81436 55188 నంబరులో సంప్రదించవచ్చు.