01-03-2025 11:57:15 AM
ఫోక్సో కేసు నమోదు
బెల్లంపల్లి,(విజయక్రాంతి): తరగతి గదుల్లోనే నవ నూతన సమాజం ఆవిష్కరింప బడుతుందన్న వాస్తవిక వృత్తి ధర్మానికి కళంకం తీసుకువచ్చాడు ఓ ఉపాధ్యాయుడు. చిన్నారులు విద్యాబుద్ధులు నేర్పి సమాజం గర్వించే పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యతను మరిచిపోయి ప్రవర్తించాడు. విలువైన పాఠాలు చెప్పి భవిష్యత్తును నిర్మించాల్సిన ఉపాధ్యాయుడే కీచకుడుగా మారి ఓ పసి మొగ్గను చిదిమేసే ప్రయత్నానికి ఒడిగట్టాడు.
మంచిర్యాల జిల్లా భీమిని మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం విద్యార్థినిపై రేగు చెట్టు రమేష్ అనే ఎస్ జి టి (సెకండరీ గ్రేడ్ టీచర్) అసభ్యంగా ప్రవర్తించాడు. పాఠశాలలో ఉపాధ్యాయుని ప్రవర్తనను విద్యార్థిని తన తల్లిదండ్రులకు తెలిపి బోరున ఏడ్చింది. దీంతో తల్లిదండ్రులు, బంధువులు పాఠశాలలో ఉపాధ్యాయుడు రమేష్ ను చితకబాదారు. ఈ విషయం తెలుసుకొని పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఉపాధ్యాయుడు రమేష్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు రమేష్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ విషయం ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.