calender_icon.png 11 October, 2024 | 2:58 AM

రుణగ్రహీతలకు వేధింపుల ఉరి

04-09-2024 12:20:56 AM

  1. ఆన్‌లైన్ దా‘రుణాలు’ ఎన్నెన్నో..! 
  2. లోన్ తీసుకుని ఒక్క ఈఎంఐ తప్పితే చాలు 
  3. మార్ఫింగ్ ఫొటోలు పంపి.. 
  4. కాంటాక్ట్ లిస్ట్ నంబర్లకు కాల్ చేసి వేధింపులు 
  5. చిత్రహింసలకు గురై బాధితుల బలవన్మరణాలు

మంచిర్యాల జిల్లాకు చెందిన వెంకటేశ్ హైటెక్ సిటీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. జీడిమెట్ల పీఎస్ పరిధిలోని గాజులరామారంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటుపడిన వెంకటేశ్ సుమారు రూ. 25 లక్షల వరకు అప్పులు చేశాడు. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేక లోన్‌యాప్‌ల ద్వారా కొంత రుణం తీసుకున్నాడు.

లోన్‌యాప్ కంపెనీ ప్రతినిధుల వేధింపులు భరించలేక ఇటీవల తన ఇద్దరు పిల్లలు, భార్యకు విషం ఇచ్చాడు. వారు చనిపోయారని నిర్ధారించుకున్నాక తానూ ఉరేసుకుని బలవన్మరణా నికి పాల్పడ్డాడు. ..ఇలా నిత్యం ఏదో ఒక చోట ఒకటో రెండో బలవన్మరణాలు చోటుచేసుకుం టున్నాయి. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పండంటి కాపురాలు కూలిపోతున్నాయి. తల్లిదండ్రులు బలవన్మరణానికి పాల్పడగా పిల్లలు అనాథలుగా మిగులుతున్నారు.

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): లోన్ యాప్ కంపెనీలు అవసరార్థులకు అప్పు ఇచ్చి ఆ తర్వాత వేధింపులకు పాల్పడుతున్నాయి. చివరకు పరోక్షంగా రుణగ్రహీ త ప్రాణాలు తీస్తున్నాయి. రుణం తీసుకున్న తర్వాత సకాలంలో వాయిదాలు చెల్లించకపోతే రుణగ్రహీతను చిత్రహింసలకు గురిచే స్తున్నాయి. ఇచ్చిన అప్పుకు దాదాపు నాలు గు రేట్లకు పైగా వడ్డీలు, చెక్ బౌన్స్ జరిమానాలు వసూలు చేస్తున్నాయి. ఈ దారుణాలపై ఎవరికి ఎలా ఫిర్యాదు చేయా లో తెలియక చాలామంది జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నా రు. అవసరానికి తక్కువ పేపర్ వర్క్‌తో నిమిషాల్లో అప్పు ఇస్తామంటూ సోషల్ మీడియాలో యాప్ కంపె నీలు పెద్దఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రచారా న్ని చూసి ఎవరైనా వారిని సం ప్రదిస్తే సిబిల్ స్కోర్ ఆధారంగా లోన్స్ మంజూరు చేస్తున్నాయి. ప్రతినెలా వాయిదాలు నిర్ణీత సమయంలో చెల్లిస్తే సరే.. ఒక్కరోజు ఆలస్యమైనా టార్చర్ మొదలుపెడతారు.

మార్ఫింగ్ ఫోటోలతో వేధింపులు..

రుణం తీసుకున్న వారు సకాలంలో చెల్లించకపోతే కొన్ని యాప్ కంపెనీలు వారి ఫోన్ గ్యాలరీ నుంచి ఫొటోలు తీసుకుంటున్నాయి. వాటిని అసభ్యకర రీతిలో మార్ఫిం గ్ చేసి మొదటగా రుణగ్రహీతకు పంపించి బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నాయి. అయి నా ఈఎంఐ చెల్లించకపోతే రుణగ్రహీత సన్నిహితులు, కుటుంబసభ్యులతో పాటు కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న ప్రతిఒక్కరికీ ఆ ఫొటోలను పంపిస్తున్నాయి. ఇలా ఏటా దేశ వ్యాప్తంగా రూ.50 వేల కోట్ల వరకు లోన్ యాప్ సంస్థల టర్నోవర్ ఉందంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. బాధితులు వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా.. అసలు నిందితులే కాదు యాప్ సర్వర్లు కూడా విదేశాల్లో ఉండటంతో వారు కూడా ఏమీ చేయలేని దుస్థితి ఏర్పడింది.

దంపతుల బలవన్మరణం

సికింద్రాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి అవసర నిమిత్తం లోన్ యాప్‌లో రుణం తీసుకున్నాడు. తొలి ఐదారు నెలల్లో సమయానికి ఈఎంఐ చెల్లించాడు. అనుకోని కారణాలతో ఒక్క నెల ఈఎంఐ చెల్లింపు ఆలస్యమైంది. దీంతో లోన్ తీసుకున్న కంపెనీ నుంచి ఉద్యోగికి ప్రతి రోజు సుమారు 100 వరకు కాల్స్ వచ్చేవి. యాప్ కంపెనీ ప్రతినిధులు అంతటితో ఆగకుండా ఉద్యోగికి కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న వారందరికీ కాల్స్ చేయడం ప్రారంభించారు.

ఫలానా వ్యక్తి తమ వద్ద లోన్ తీసుకుని చెల్లించడం లేదంటూ చెప్పసాగారు. కాల్ రిసీవ్ చేసుకున్న వారు కాల్ చేసి తిరిగి సదరు ఉద్యోగికి చెప్పడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఇటీవల భార్యతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయినప్పటికీ లోన్ యాప్ ప్రతినిధులు శాంతించలేదు. మృతుడి సోదరుడికి కాల్ చేసి రుణం చెల్లించాలని వేధింపులు ప్రారంభించారు.

ఉద్యోగిని ఖాతా నుంచి రూ. 1.10 లక్షలు హుష్

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి) : మనీలాండరింగ్‌లో ప్రమేయం ఉందంటూ ఓ మహిళను బెదిరింపులకు గురిచేసి సైబర్ నేరగాళ్లు ఆమె ఖాతాలో ఉన్న రూ. 1.10 లక్షలను కాజేశారు. తెలిసిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగినికి ఇటీవల అపరిచిత వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి తనకు తను పోలీసు ఉన్నతాధికారిగా పరిచయం చేసుకున్నాడు. ఉద్యోగినికి 17 మనీలాండరింగ్ కేసులతో ప్రమేయం ఉందని, ఆమెపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైందని బెదరించాడు.

వాటిని క్లియర్ చేసుకోకుంటే విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని, లేదంటే అరెస్టు తప్పదని ఆమెను భయపెట్టాడు. విచారణ నిమిత్తం ఆమె ఖాతాలో ఉన్న మొత్తాన్ని తాము సూచించిన ఖాతాకు బదిలీ చేయమని సూచించాడు. దీంతో బాధితురాలు తన ఖాతాలో ఉన్న రూ.1.10 లక్షలను బదిలీ చేసింది. అనంతరం ఆమె ఎన్నిసార్లు కాలర్ నెంబర్‌కు కాల్ చేసినా స్పందన లేదు. దీంతో ఆమె మోసపోయానని గ్రహించి మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.