calender_icon.png 19 March, 2025 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిసిలకు 42 శాతం రిజర్వేషన్‌ బిల్లు ఆమోదించడం పట్ల హర్షం..

18-03-2025 07:29:15 PM

అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి గుంజ శ్రీనివాస్...

ముషీరాబాద్ (విజయక్రాంతి): విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థలలో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును రాష్ట్ర శాసనసభ ఆమోదించడం హర్షనీయమని అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐ.ఎన్,టి.యు.సి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గుంజ శ్రీనివాస్‌ అన్నారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి తీసుకువచ్చిన బిసి రిజర్వేషన్‌ బిల్లు దేశానికే ఆదర్శమన్నారు. ఈ మేరకు మంగళవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గుంజ శ్రీనివాస్ మాట్లాడుతూ... బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభ్యున్నతి కోసం రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు బిసి రిజర్వేషన్‌ బిల్లు ఒక నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

‘జనాభాలో బిసిలు ఎంత శాతమో అధికారంలో అంత భాగం’ అనే కాంగ్రెస్‌ అగ్ర నాయకులు రాహుల్‌గాంధీ ఆశయానికి అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాష్ట్రంలో చర్యలు చేపట్టారని, అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర ఇంటింటి కులగణన సర్వేను (విద్యా, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ) చేపట్టిందని, ఈ సర్వే లెక్కల ఆధారంగా బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించి బిసి రిజర్వేషన్‌ బిల్లును తీసుకురావడాన్ని అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం స్వాగతిస్తుందన్నారు. బిసి రిజర్వేషన్ల అమలుకు సహకరించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సోమవారం లేఖ రాయడం, శాసనసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌, బిజెపి, ఎంఐఎం, సిపిఐ నాయకుల బృందంతో  కలిసేందుకు తమకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని సిఎం తన లేఖలో ప్రధానికి విజ్ఞప్తి చేయడం బిసి రిజర్వేషన్ల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్దికి నిదర్శనమన్నారు.

విద్యా సంస్థలలోని  సీట్లలో, ఉద్యోగ నియామకాల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను పెంచేందుకు, అలాగే రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్‌ను పెంచడం వల్ల ఈ వర్గాల ప్రజల అభ్యున్నతి త్వరితగతిన సాధ్యమవుతుందన్నారు. శాసనసభాపక్ష నాయకునిగా తాను బిసి రిజర్వేషన్ల సాధనకు నాయకత్వం వహిస్తానని, బిసి రిజర్వేషన్లను సాధించే వరకు విశ్రమించబోనని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించడం ఆయన పరిపాలనా దక్షతను తెలియజేస్తుందన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే బిసి రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతామని ఎన్నికల సందర్భంగా  ‘కాంగ్రెస్‌ కామారెడ్డి డిక్లరేషన్‌'కు తాము కట్టుబడి ఉన్నామని బిసి రిజర్వేషన్‌ బిల్లును తీసుకురావడం ద్వారా రేవంత్‌రెడ్డి రుజువు చేశారన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై కులగణన చేసిన మొదటి రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్రం కావడం గర్వకారణమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన బిల్లు రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందేందుకు మద్దతు ఇచ్చిన బిఆర్‌ఎస్‌, బిజెపి, సిపిఐ, ఎంఐఎం తదితర అన్ని రాజకీయ పార్టీలకు గుంజ శ్రీనివాస్‌ కృతజ్ఞతలు తెలియజేశారు.