calender_icon.png 16 January, 2025 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘుమఘుమల సంక్రాంతి!

14-01-2025 12:00:00 AM

తెలుగువారికి ఇష్టమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి. సంక్రాంతి అంటేనే ముగ్గులు, గాలిపటాలు, గంగిరెద్దులతో పాటు పిండి వంటలూ గుర్తుకొస్తాయి. నోరూరించే పిండి వంటల కోసం చిన్నాపెద్ద ఎదురుచూస్తుంటారు. వారం ముందు నుంచే ఇంటింటా పిండి వంటలు చేస్తూ బిజీ అయిపోతారు మహిళలు. అరిసెలు, గారెలు, కొబ్బరిబూరెలు, నువ్వుల లడ్డూలు, కజ్జికాయలు ఇలా రకరకాల పిండి వంటల తయారీతో వీధులు ఘుమఘుమలాడుతుంటాయి. సంక్రాంతి స్పెషల్.. నోరూరించే ట్రెడిషనల్ రెసిపీలివి.. 

అరిసెలు

కావాల్సిన పదార్థాలు: బియ్యం, బెల్లం, యాలకుల పొడి, నెయ్యి, నూనె, నువ్వులు. 

తయారీ విధానం: అరిసెలు తయారు చేయడానికి ముందు బియ్యాన్ని శుభ్రంగా కడిగి, ఆరబెట్టి.. మెత్తగా అరిసెలకు పిండి పట్టించాలి. ఈలోపు బెల్లం పాకం తయారు చేసుకోవాలి. స్టవ్ వెలిగించి.. ఖాళీగా ఉండే పాత్రలో బెల్లం తురుము, నీళ్లు పోసి బాగా కలపాలి. బెల్లం కరిగి బుడగలు వస్తూ ఉంటాయి.

ఇప్పుడు యాలకుల పొడి వేసి కలపాలి. బెల్లం పాకం ఎలా ఉండాలంటే.. పాకం మెత్తటి ముద్దలా ఉండాలి. అలా బెల్లం పాకాన్ని తయారు చేసుకోవాలి. ఇందులో ముందుగా పట్టించి పెట్టుకున్న బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి సరిపోయింది అనుకున్నప్పుడు.. ఈ మిశ్రమాన్ని గట్టిగా తిప్పుతూ ఉండాలి. దీన్ని కాసేపు కప్పి పెట్టాలి. ఈ లోపు పెద్ద ఇనుప కడాయిలో నూనె పోసి వేడెక్కించాలి. నూనె వేడెక్కాక.. మంటను మీడియంలో ఉంచి అరిసెలు గోధుమ రంగులోకి వచ్చేంత వరకూ వేయించాలి. 

కొబ్బరి బూరెలు

కావాల్సిన పదార్థాలు: బియ్యం రెండు కప్పులు, పచ్చికొబ్బరి అరకప్పు, బెల్లం ఒకటిన్నర కప్పు, నువ్వులు పావు కప్పు, వంటసోడా అర చెంచా, యాలకుల పొడి ఒక చెంచా, నూనె వేయించడానికి సరిపడా. 

తయారీ విధానం: ముందుగా బియ్యాన్ని బాగా కడిగి రోజంతా నానబెట్టాలి. నీళ్లు వంపిన బియ్యాన్ని ఆరబెట్టి పిండి పట్టుకుని జల్లించాలి. మందపాటి గిన్నెలో బెల్లం ముదురు పాకం పట్టుకోవాలి. తర్వాత ఆ గిన్నెను దింపి యాలకుల పొడి, వంటసోడా, నువ్వులు, పచ్చికొబ్బరి వేసి కొద్దికొద్దిగా పిండి చేస్తూ బాగా కలపాలి. పిండి ఆరిపోకుండా మూతపెట్టి కొంచెం కొంచెం తీసుకుంటూ బూరెలు ఒత్తుకోవాలి. వాటిని వేడివేడి నూనెలో కాల్చుకుంటే నోరూరించే కొబ్బరి బూరెలు సిద్ధం. 

కజ్జికాయలు

కావాల్సిన పదార్థాలు: మైదా పిండి పావు కిలో, కరిగించిన నెయ్యి మూడు చెంచాలు, పల్లీలు ఒక చెంచా, నువ్వులు అర కప్పు, పుట్నాల పప్పు ఒక కప్పు, బెల్లం మూడు వందల గ్రాములు, యాలకుల పొడి ఒక చెంచా, నూనె వేయించడానికి సరిపడా. 

తయారీ విధానం: ముందుగా ఓ పాత్ర తీసుకుని అందులో మైదా పిండి, నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తని ముద్దలా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పల్లీలు వేసి దోరగా వేయించుకుని తీసి పక్కన పెట్టాలి. అదే పాన్‌లో నువ్వులు వేసి కాసిన్నీ నీళ్లు చిలకరించి వేయించి పక్కకు పెట్టుకోవాలి. పల్లీలు చల్లారిన తర్వాత పొట్టు తీసి సెపరేట్ చేసుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని పల్లీలు, ఎండు కొబ్బరి తురుము, నువ్వులు, పుట్నాల పప్పు, బెల్లం తురుము వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ముందే కలుపుకున్న మైదా పిండిని మరోసారి కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఉండను తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ పల్చగా చపాతీగా చేసుకోవాలి. ఇప్పుడు కజ్జికాయలు చేసే మౌల్డ్ తీసుకుని అందులో కొద్దిగా పొడి పిండి చల్లి.. ప్రిపేర్ చేసుకున్న చపాతీ పెట్టి.. అందులో రెండు చెంచాల పల్లీల మిశ్రమాన్ని వేసి మౌల్డ్ అంచులకు లైట్‌గా తడి అంటించి క్లోజ్ చేసి గట్టిగా ప్రెస్ చేయాలి.

తర్వాత మిగిలిన పిండి తీసేసి మౌల్డ్ ఓపెన్ చేసి కజ్జికాయలను ప్లేట్‌లో పెట్టికోవాలి. ఇలా మిగిలిన కజ్జికాయలను కూడా అలానే చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి.

నూనె వేడెక్కిన తర్వాత కజ్జికాయలను నెమ్మదిగా నూనెలో వేసి మంటను మీడియంలో పెట్టి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వస్తే తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి మారిపోతాయి. మంటను హై ఫ్లేమ్‌లో పెట్టి చేస్తే అవి తొందరగా రంగు మారి చల్లారిన తర్వాత రుచి మారిపోతాయి. 

మురుకులు

కావాల్సిన పదార్థాలు: అటుకులు కప్పు, పుట్నాల పప్పు అరకప్పు, బియ్యం పిండి కప్పు, జీలకర్ర చెంచా, నువ్వులు చెంచా, ఉప్పు రుచికి సరిపడా, మిరియాల పొడి చిటికెడు, నూనె వేయించడానికి సరిపడా.

తయారీ విధానం: ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి అటుకులు, పుట్నాల పప్పు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దీనిని జల్లించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మురుకుల పిండి కలపడం కోసం.. ఒక గిన్నెలో బియ్యం పిండి తీసుకోవాలి.

ఇందులో నువ్వులు, జీలకర్ర, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. అలాగే బటర్ వేసి పిండిని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ.. పిండిని చాలా సాఫ్ట్‌గా మారేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు స్టౌపై గిన్నె పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడి అయ్యేవరకు.. మురుకుల గొట్టంతో పిండిని వేసి.. గోల్డెన్ కలర్‌లో కాల్చుకుని ప్లేట్‌లోకి తీసుకోవాలి. 

మినపప్పు గారెలు

కావాల్సిన పదార్థాలు: మినపప్పు ఒకటిన్నర కప్పు, బియ్యం రెండు చెంచాలు, ఉప్పు సరిపడా, కరివేపాకు కొంచెం, పచ్చిమిర్చి(తరిగి), మిరియాల పొడి ఒక్కోటి అర చెంచా చొప్పున, ఇంగువ చిటికెడు, అల్లం తురుము ఒక చెంచా. 

తయారీ విధానం: మిక్సీజార్‌లో నానబెట్టిన మినపప్పు, బియ్యం, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత పిండిని ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. అందులో ఉప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు, మిరియాల పొడి, ఇంగువ, అల్లం తురుము వేసి కలిపి కాసేపు పక్కన పెట్టాలి. ఆ తర్వాత కవర్ మీద నెయ్యి రాసి, పిండి వేసి గారెలా చేయాలి. గారెల్ని వేసి నూనెలో వేసి రెండు వైపులా కాల్చాలి.