డిజిటల్ యుగంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం సర్వసాధారణంగా మారింది. సీనియర్ సిటీజన్స్ సైతం టెక్నాలజీని అందిపుచ్చుకొని రోజువారి పనులను చక్కబెట్టుకుంటున్నారు. వాతావరణం, ఆరోగ్యం, వ్యక్తిగత భద్రతనిచ్చే యాప్స్‌ను వాడుతూ చురుగ్గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రోజువారి జీవితాన్ని సులభతరం చేసే కొన్ని బెస్ట్ యాప్స్ ఉన్నాయి. అవేంటో తెలుసా..
ఎవర్ గ్రీన్ క్లబ్
‘ఎవర్ గ్రీన్ క్లబ్’ అనేది యాభై, అంతకంటే ఎక్కువ వయస్సున్న వ్యక్తులకు ఉపయోగపడే సోషల్ నెట్ వర్కింగ్ యాప్. సురక్షితంగా ఫోటోలు, వీడియోలను షేర్ చేసుకోవచ్చు. ఒకే రకమైన అనుభవాలను పంచుకునే కొత్త వ్యక్తులతో కనెక్ట్ కావచ్చు. వృద్ధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ యాప్‌లో లైవ్ సెషన్లు, ఇతర కోర్సులెన్నో ఉంటాయి. 40కి పైగా రోజువారీ లైవ్ సెషన్లను కలిగి ఉన్న ఈ వేదిక ఎంతోమందిని దగ్గరచేస్తోంది. అర్థవంతమైన చర్చలు, కొత్త విషయాలు నేర్చుకోవడానికి వీలుగా ఉంటుంది.
సీనియర్ ఫిట్‌నెస్
సీనియర్ ఫిట్‌నెస్ బాగా ఉపయోగపడే యాప్. ఇది ఆరోగ్య రక్షణలో కీలకం. ఏ వయసుగలవారు ఏయే వ్యాయామాలు చేయాలి? ఎలాంటి వ్యాయామాలు చేయాలి? లాంటి విషయాలను తెలియజేస్తుం ది. ఫిట్‌నెస్ గురూలా పాఠాలు చెప్తుంది. ఈ యాప్ ద్వారా సీనియర్లు ప్రతి నెలా వ్యాయామ లక్ష్యాన్ని నిర్దేశించుకోవచ్చు. మోకాలి నొప్పి, తుంటి నొప్పి, మెడ నొప్పి, కీళ్ల నొప్పులు మొదలైన వాటికి నివారణ వ్యాయామాలను కూడా ఈ యాప్ తెలియజేస్తుంది.
సీనియర్ సేఫ్టీ
సీనియర్ సేఫ్టీ యాప్ ప్రత్యేకంగా సీనియర్ల కోసం రూపొందించబడింది. ఎవరైనా ఆపదలో ఉంటే సంరక్షకులకు వెంటనే ‘ఆటోమేటెడ్ ఎమర్జెన్సీ అలర్ట్’ను అందిస్తుంది. సీనియర్ కేర్ హోమ్‌లలో ఈ యాప్ ప్రజాదరణ పొందింది. ఫోన్ పడిపోయేముందు హెచ్చరికలు పంపడం, ఏదైనా ప్రమాదం జరిగితే పసిగట్టి సంకేతాలు ఇవ్వడం దీని ప్రత్యేకత. అలాగే ఏదైనా పని మీద బయటకువెళ్తే ఆ ఏరియా లొకేషన్.. ఇతర వివరాలను ఎప్పటికప్పుడు ఇతరులకు చేరవేస్తుంటుంది.
-మెడిసేఫ్
వయస్సు పెరిగేకొద్దీ జ్ఞాపకశక్తి తగ్గుతూ వస్తోంటుంది. అద్దాలు, ఫోన్ ఎక్కడ పెట్టారో? సమయానికి ఏయే మందులు వేసుకోవాలో? తెలియక చాలామంది ఇబ్బందులు పడుతుంటారు. అలాంటప్పుడు మెడిసేఫ్ యాప్ వ్యక్తిగత సహాయకుడిగా, స్నేహితునిగా పనిచేస్తుంది. ఇందులో మందుల జాబితా అప్ లోడ్ చేస్తే.. అందులోని రిమైండైర్లు గుర్తుచేస్తాయి.
కేలరీల కౌంటర్
చాలామందికి స్వీట్లు తినాలని, ఇష్టమైన పదార్థాలని లాగించేయాలనిపిస్తుంది. కానీ మధుమేహం, బీపీ లాంటి అనారోగ్య సమస్యలతో వెనుకడగు వేస్తుంటారు. వయసుపైబడుతుండటంతో సమతుల్య ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. రోజుకూ ఎన్ని కేలరీలు తీసుకుంటున్నామో? తెలుసుకోవడం అవసరం. ఈ క్రమంలో కేలరీల కౌంటర్ యాప్ సరైనది. ఎందుకంటే ఇది మీరు తినే ఆహార కేలరీలు, బరువును పరిశీలిస్తూ ఆ వివరాలను తెలియజేస్తుంటుంది.
లైఫ్ 360
లైఫ్ 360 లొకేషన్ షేరింగ్‌కు బాగా ఉపయోగపడుతుంది. ఇది సీనియర్లు ఎక్కడికి చేరుకోవాలో తెలుసుకోవడానికి తెలియజేస్తుంది. జీపీఎస్ ట్రాకింగ్ సురక్షితమైన ప్రయాణాలను నిర్దేశిస్తుంది. గమ్యస్థానం, వేగ పరిమితి, డ్రైవింగ్ సమయాన్ని ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది.