15-03-2025 12:00:00 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 14(విజయక్రాంతి) : నగరంలో హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి మధ్యా హ్నం వరకు నగరవాసులు వేడుకల్లో మునిగితేలారు. గల్లీగల్లీలో రంగులు పూసుకుంటూ, టమాటాలు, కోడిగుడ్లు కొట్టుకుంటూ, నీళ్లు చల్లుకుంటూ, నగరవాసులు ఉత్సాహంగా గడిపారు.
బ్యాండు చప్పుళ్లు, డీజే పాటలకు పిల్లలు, యువత, పెద్దలు ఆటపాటలతో కేరింతలతో చేసుకున్న హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. అపార్ట్‌మెంట్లు, కమ్యూనిటీల్లో ప్రత్యేకంగా వేడుకలు జరుపుకొన్నారు. తెలంగాణ రాజ్ భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయన కుటుంబ సభ్యులు, పిల్లలతో హోలీ వేడుకల్లో పాల్గొన్నారు.
నగరంలోని పలు ప్రాంతాల్లో ఈవెంట్లు నిర్వహించారు. ఒక్కో ఈవెంట్‌లో వందలాది మంది పాల్గొన్నారు. పలు చోట్ల సినీతారలు సందడి చేశారు. ట్యాంక్‌బండ్ పీపుల్స్ ప్లాజా, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, మాదాపూర్, తదితర ప్రాంతాల్లో యువత డాన్స్‌లతో హోరెత్తించారు.
హోలీ వేడుకలు ప్రశాంతంగా జరిగా యి. హోలీ, రంజాన్ మాసంలో వచ్చిన శుక్రవారం సందర్భంగా నగరంలోని పలు చోట్ల పోలీసులు పికెట్‌లు ఏర్పాటు చేశారు.