04-03-2025 12:00:00 AM
కమలినీ ముఖర్జీ.. అసలు పేరు రోష్నీ, రోని. 1984, మార్చి 4న కలకత్తా లో జన్మించింది. స్కూల్ డేస్ నుంచే నాటకాల ప్రదర్శనలో పాల్గొనేది. కమలినిని ఓ యాడ్ ఫిల్మ్ లో చూసిన దర్శకురాలు రేవతి ‘ఫిర్ మిలేం గే’ (2004)లో ఛాన్స్ ఇచ్చారు. తెలుగులో ‘ఆనంద్’తో కథానాయికగా పరిచయమైంది. గోదావరి, హ్యాపీడేస్, గోపి గోపిక గోదావరి, జల్సా, గమ్యం వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపునిచ్చాయి.
శ్రద్ధా దాస్ 1987, మార్చి 4న జన్మించింది. ముంబై యూనివర్సిటీ నుంచి పాత్రికేయ రంగంలో డిగ్రీ పట్టా పొందిన ఈమె నటిగా సినీ ఇండస్ట్రీలోకి ఎం ట్రీ ఇచ్చింది. పలు హిందీ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించింది. తెలుగులో పలు సినిమాల్లో స్టార్ హీరోల సరసన కథానాయకిగా మెప్పించింది. ఆమె టాలీవుడ్‌లో తొలిసారి ‘సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం’ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆమె చివరిసారి ‘పారిజాత పర్వం’లో నటించింది.
నందినీరెడ్డి.. లెజెండరీ లేడీ డైరెక్టర్‌గా సత్తా చాటారు. 1980, మార్చి 4న ఆమె పుట్టిన రోజు. గుణ్ణం గంగరాజు డైరెక్షన్ టీమ్‌లో ‘లిటిల్ సోల్జర్స్’ సినిమాకు పనిచేశారు. కృష్ణవంశీ ‘చంద్రలేఖ’ చిత్రానికీ పనిచేశారు. ‘అలా మొదలైంది’ అనే సినిమాతో దర్శక వృత్తిని ప్రారంభించారు. జబర్దస్త్, కల్యాణ వైభోగమే, అన్నీ మంచి శకునములే వంటి చిత్రాలు ఆమెకు పేరు తెచ్చాయి.
చంద్రశేఖర్ ఏలేటి పుట్టిన రోజు మంగళవారమే. 1973, మార్చి 4న జన్మించిన ఆయన గుణ్ణం గంగరాజు దర్శకత్వం వహించిన ‘లిటిల్ సోల్జర్స్’కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయడం ద్వారా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో జర్నీ ప్రారంభించారు. అమృతం సీరియల్ తొలి 10 ఎపిసోడ్స్‌కు ఈయనే దర్శకుడు. ‘ఐతే’ సినిమాతో డైరెక్టర్‌గా మారారు.