తాగుబోతు రమేశ్.. మద్యపానం అలవాటు లేకున్నా సినిమాల్లో పోషించిన ఫేమస్ పాత్ర పేరుతోనే టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన ఈ తెలుగు సినీ హాస్య నటుడి పుట్టిన రోజు నేడు. 1981 నవంబర్ 25న పుట్టిన ఆయన నేడు 43వ పడిలోకి అడుగిడుతున్నారు. ఇతని అసలు పేరు రమేశ్ రామిళ్ల. పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని సమీపంలో ఉన్న రామగుండం ఆయన స్వస్థలం.
చిన్నప్పట్నుంచీ మద్యపాన ప్రియులను బాగా పరిశీలించే రమేశ్.. మద్యం మత్తులో వారు ఎలా ప్రవర్తిస్తారో నటిస్తూ అందరినీ నవ్వించేవారు. 2006లో అక్కినేని ఫిలిం ఇన్స్టిట్యూట్ నుంచి నటనలో పట్టా పుచ్చుకున్న ఆయన అంతకుముందు 2005లో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘జగడం’లో తొలిసారి చిన్న పాత్ర చేశారు.
‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’ చిత్రంలోని ఆయన నటనకు గాను 2013లో ఉత్తమ హాస్య నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు. ‘ఆహ నా పెళ్లంట’, ‘గాలివాన’ వంటి వెబ్ సిరీస్లు, ‘రెండు రెళ్లు ఆరు’ అనే సీరియల్లోనూ నటించి మెప్పించారు. ఆయన తాజాగా నటించిన ‘కేశవ చంద్ర రమావత్ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది.