బోనీ కపూర్ భారతీయ సినీ పరిశ్రమలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. 1955, నవంబర్ 11న ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో పంజాబీ హిందూ కుటుబంలో జన్మించిన ఆయన సోమవారంతో 69వ పడిలోకి అడుగిడనున్నారు. బాలీవుడ్‌లో నిర్మాతగా ఎదిగిన ఆయన ‘మిస్టర్ ఇండియా’, ‘నో ఎంట్రీ’, ‘జుదాయీ’, ‘వాంటెడ్’ వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు నిర్మించారు.
కెరీర్ తొలినాళ్లలో ప్రముఖ దర్శక నిర్మాత శక్తి సమంత వద్ద సహాయకుడిగా పనిచేశారు. శేఖర్ కపూర్ దర్శకత్వంలో అనిల్ కపూర్, శ్రీదేవి ప్రధాన పాత్రధారులుగా బోనీ నిర్మించిన ‘మిస్టర్ ఇండియా’ ప్రఖ్యాతమైన సినిమాగా నిలిచింది. ఈ చిత్రానికి స్టార్ అండ్ స్టుల్ ఉత్తమ చిత్రం పురస్కారం దక్కింది.
2000 సంవత్సరంలో ఆయన నిర్మించిన ‘పుకార్’కు నర్గీస్ దత్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీచర్ ఫిలిం ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ వరించింది. కపూర్ సినిమా రంగంలో చేసిన సేవలకు సైతం వచ్చిన పురస్కారాలు కోకొల్లలు. ఆయనకు దక్కిన పురస్కారాల్లో.. కైరో అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ సాఫల్య పురస్కారం (2009), ప్రొడ్యూసర్ ఆఫ్ ది మిలీనియం హానర్ ఫిలిం అవార్డు (2013) చెప్పుకోదగ్గవి.