గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వాల్ పోస్టర్స్, రైటింగ్స్ వంటివాటిని నిషేధిస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఉత్తర్వులు జారీ చేయడం స్వాగతించదగ్గ చర్య. అయితే, ఈ ఆదేశాలను కచ్చితంగా అమలు చేసేలా కింది అధికారులు చర్యలు తీసుకోవాలి. లేకపోతే, మళ్లీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. ఇదే కనుక అమలైతే, మహానగరం బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. సుందరీకరణే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ ఇలా ముందుకు వెళ్లడం అభినందనీయం.
అలాగే, అనేక కూడళ్లలో పరిసరాల పరిశుభ్రత కోసం దోమల నివారణ, మురికివాడల అభివృద్ధి, స్వచ్ఛత పచ్చదనం కార్యక్రమాలలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలి. అనుమతి లేకుండా గోడలపై రాతలు రాసిన, పోస్టర్లు అతికించిన సంస్థలు, వ్యక్తులపై భారీ జరిమానాలు విధించాలన్న నిర్ణయమూ హర్షణీయం.
ఆయా ఇండ్ల యజమానులు నిర్మాణ, తదితర వ్యర్థాలను రోడ్లపైనే వదలడం క్షమార్హం కాదు. రోడ్లు తవ్వేసి, వాటిని పూడ్చకుండా అడ్డదిడ్డంగా వదిలేయడమో లేదా మట్టి కుప్పలుగా వుంచడమో చేయడం వల్ల ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. సుందరీకరణ విషయంలో ప్రజలంతా ఎవరికి వారు తమ బాధ్యతను గుర్తెరగాలి.
నేదునూరి కనకయ్య, హైదరాబాద్