calender_icon.png 15 January, 2025 | 5:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంతోషమే ఉత్తమత్వం

18-09-2024 12:00:00 AM

సంతోష స్త్రిషు కర్తవ్యః 

స్వదారే భోజనే ధనే,

త్రిషుచైవ న కర్తవ్యో 

అధ్యయనే జప దానయోః!

- చాణక్య నీతి: 7---4

మానవులు సంతోషించాల్సిన మూ డు విషయాలను, సంతోషించకూడని మూడు విషయాలను చెపుతున్నాడు ఆ చార్య చాణక్య. “తన జీవిత భాగస్వామి విషయంలోనూ, ఆకలిగా ఉన్నప్పుడు ల భించిన ఆహారంలోనూ, ఇష్టపడి చేస్తున్న పనిలో లభించే ఆదాయంతోనూ సంతోషించాలి. అలా తృప్తి చెందకపోతే తనకు తానే నిరంతర దుఃఖాన్ని కొని తెచ్చుకున్న వాడవుతాడు. శాస్త్రాలను అధ్యయ నం చేయడంలోనూ, దైవ స్మరణలోనూ, ఒకరికి దానం ఇవ్వడంలోనూ తృప్తి చెందవద్దు” అంటూ సంతోషపు మహత్తును ప్రతిపాదిస్తున్నారాయన.

“భార్య రూపసి అయినా కాకపోయి నా, విద్యావేత్త అయినా కాకపోయినా, నైపుణ్యం కలిగినదైనా కాకపోయినా ఆ నందంగా భార్య సాంగత్యాన్ని ఆస్వాదించాలి. ‘సంతుష్టో భార్యయా భర్తా, భర్తా భార్యా తదైవచ, యన్నిన్నైవ కులోన్ని త్యం, కళ్యాణం తత్రవైధృవం’ భార్యతో భర్త, భర్తతో భార్య సంతోషిస్తున్న ఇంట్లో సకల కళ్యాణాలు నిలుస్తాయి” అన్నాడు మనువు. భార్యాభర్తల మధ్య అవగాహనతో కూడిన సమన్వయం నిలిస్తే వారి కాపురంలో ఆనందం పల్లవిస్తుంది. భా ర్యాభర్తల మధ్య స్వేఛ్చకన్నా రక్షణయే ప్రధానమైంది. 

ఆకలి గొన్న వానికి ఎలాంటి ఆహారం లభించినా అది అపురూపమైందిగా కనిపిస్తుంది. అయితే, మనసుకు, శరీరానికి అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. ఆకలి వేసిన సమయంలో ఎలాంటి అహారమైనా, ఎలా ఇచ్చినా శరీరానికి అభ్యంత రం ఉండదు. కానీ, మనసు పరిశుభ్రమై న ఆహారాన్ని, అదీ సగౌరవంగా కావాలని కోరుకుంటుంది. ఇష్టమైన పనిని ‘చిన్నదా పెద్దదా’ అని చూడకుండా, అదెంత కష్టమైనా నిర్వహించేందుకు సన్నద్ధులమై ఉంటాం. అ యితే, ఒక్కొక్కరు పనిని ఒక్కొక్క దృష్టి కోణంతో చూస్తారు.

దేవాలయాన్ని నిర్మిస్తున్న ముగ్గురు కార్మికులలో ఒకరు తా ను చేసే పనిని భారంగా, పొట్ట పోసుకునేందుకు ఉపకరణంగా భావించాడు. మ రొకతనేమో అది తన కర్తవ్యమని అనుకున్నాడు. మూడవ వ్యక్తి మాత్రం ఆ పనిని దైవానికి చేసే సేవగా ఉపాసనా మార్గం గా తలచాడు. మొదటి వానిలో అసహనంతో కూడిన అసంతృప్తి ఉంటుంది. రెండవ వానిలో సంతృప్తి ఉంటుంది. మూడవ వానిలో ఆనందం పల్లవిస్తుంది. భార్య విషయంలోనూ, ఆహారం విషయంలోనూ, లభించే ఆదాయంలోనూ సంతృప్తిని పొందాలి.

మానవ ప్రయత్నం తప్పనిసరి

మానవుని ఆయువు పరిమితం. జ్ఞా నం అపరిమితం. జ్ఞానార్జనలో తృప్తి చెం దితే ప్రగతి ఆగిపోతుంది. వివిధ కోణాల లో శాస్త్రాలను ఆధ్యయనం చేయడం అ ధీతి (విస్తృత శోధన)గా పెద్దలు చెప్పారు. ఆధ్యయనం వల్ల జ్ఞానం, జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడంతో వివేచన అలవడుతా యి. వివేచన ఎఱుకను ప్రసాదిస్తుంది. ఎఱుకవల్ల జీవన మూలాలు అవగతమవుతాయి. అందువల్ల శాస్త్రాధ్యయనంలో ఎప్పుడూ సంతృప్తి పనికిరాదు. దైవారాధనలో కూడా సంతృప్తి ఉండకూడదు.

భగవానుని తెలుసుకోవడం అంటే పంచభూతాత్మకమైన తన ఉనికిని తెలుసుకో వడమే (భకారం భూమికి, గకారం గగనానికి, వకారం వాయువుకు, అకారం అగ్నికి, నకారం నీటికి ప్రతీకలు). న్యాయమార్గంలో సంపదను ఆర్జించడం, దానిని పెంపొందించడం, రక్షించుకోవడం, తా ను అనుభవించడం, అర్హత ప్రాతిపదికగా దానాలు చేయడం గృహస్థు కర్తవ్యంగా శాస్త్రాలు చెపుతున్నాయి. తాను అనుభవించక, ఇతరులకు దానం చేయని సంపద నశిస్తుందనీ పెద్దలు చెపుతారు.

కాబట్టి, జ్ఞానార్జనలోనూ, దైవోపాసనలోనూ, దానధర్మాలను చేయడంలోనూ సంతృప్తి పనికిరాదని చాణక్యుని భావన. చాలామంది అదృష్టం బాగుంటే అన్నీ అందుతాయనే భ్రమలో తేలిపోతుంటారు. మానవ ప్రయత్నం లేనిది ఏ దైవమూ అనుకూలించదు. మానవ ప్రయత్నం చేసినా ఫలితం అందకుంటే నిరాశ పడకుండా లభించిన దానితో సంతృప్తి చెందాలి. అంతేకానీ, అసంతృప్తి, నిరాశ నిస్పృహలతో బతుకులను ఛిద్రం చేసుకోకూడదు. పరిమితమైన జీవితంలో ఇతరులకు మంచిని కోరుతూ జీవించే వారే ఉదాత్త వ్యక్తులుగా చరిత్రలో నిలిచిపోతారు. అలాంటి వారే జీవనంలోని ఆనందాన్ని అత్యధికంగా ఆస్వాదిస్తారు.

 పాలకుర్తి రామమూర్తి