రేపు స్వామి చిన్మయానంద సరస్వతి వర్ధంతి :
“మానవ చరిత్రలో విషాదం ఏమిటంటే, సౌకర్యాలు పెరుగుతున్న కొద్దీ సంతోషం తగ్గుతున్నది. నిజమైన గురువు అంటే స్వచ్చమైన అంతఃకరణ జ్ఞానం కలవారు. పవిత్రులు, సాధించాలనే లోతైన తపన ఉన్న మనస్సు కలవారు.”
ఈ ఆలోచింపదగ్గ మాటలు అన్నది భారతీయ ప్రసిద్ధ ఆధ్యాత్మిక వేత్త స్వామి చిన్మయానంద సరస్వతి. ఆయన అసలు పేరు పూతంపల్లి బాలకృష్ణన్ మీనన్. సన్యాసిగా మారిన తర్వాత స్వామి చిన్మయానంద సరస్వతి ఆయ్యారు. 1916 మే 8న కేరళలోని ఎర్నాకులంలో జన్మించారు. 1993 ఆగస్టు 3న తనువు చాలించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని సిద్ధబరిలో వారి మహా సమాధి స్మారకం నిర్మితమైంది. ఆయన స్థాపించిన ‘చిన్మయ మిషన్’ లాభాపేక్షకు అతీతంగా పనిచేస్తున్నది. ఈ సంస్థద్వారా నిర్వాహకులు అద్వైత వేదాంతం, భగవద్గీత, ఉపనిషత్తులు, ఇతర పురాతన హిందూ రచనల జ్ఞానాన్ని సామాన్యులకు పంచుతున్నారు.