22-12-2024 01:16:06 AM
నిందితులను శిక్షించాలని ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా
చేవెళ్ల (మొయినాబాద్), డిసెంబర్ 21: మొయినాబాద్ మండలం తోల్కట్ట పరిధిలోని హనుమాన్ ఆలయంలో విగ్రహాన్ని శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. శనివారం ఉదయం పూజలు చేసేందుకు వచ్చిన గ్రామస్తులు.. గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వాళ్లు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి తోల్కట్టకు విచ్చేసి ఆలయాన్ని పరిశీలించారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే కేసీఆర్ రత్నం, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి, నేతలు, గ్రామస్తులతో కలిసి బీజాపూర్ హైవేపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకునేది లేదని, హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిత్యం హిందువుల పూజలందుకునే హనుమాన్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం బాధాకరమన్నారు.
అంతకుముందు మాజీ సర్పంచ్ శ్రీనివాస్, హునుమాన్ గుడి చైర్మన్ అంజయ్య మాట్లాడుతూ.. గ్రామస్తులు 15 ఏళ్లుగా హనుమాన్ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారని తెలిపారు. హనుమాన్ మూలవిరాట్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం క్షమించరాని నేరమని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు మొయినాబాద్ సీఐ పవన్‌కుమార్ రెడ్డి, చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్, శాబాద్ సీఐ కాంతారెడ్డి ఆధ్వర్యంలో అక్కడికి చేరుకొని త్వరలోనే నిందితులను పట్టుకుంటామని నచ్చజెప్పడంతో ధర్నా విరమింపజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అంజన్‌కుమార్ గౌడ్, ప్రకాశ్ గౌడ్ పాల్గొన్నారు.