calender_icon.png 14 April, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా హనుమాన్ శోభాయాత్ర

13-04-2025 01:39:56 AM

గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ వరకు..

17వేల మంది పోలీసులతో భద్రత

  1. భారీగా తరలివచ్చిన భక్తులు
  2. స్వాగతం పలికిన ముస్లింలు

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఏప్రిల్ 12 (విజయక్రాంతి): హనుమాన్ జయంతి సంద ర్భంగా హైదరాబాద్ నగరంలో శనివారం వీర హనుమాన్ శోభాయాత్ర ఘనంగా జరిగింది. గౌలిగూడలోని శ్రీరామ మందిరం వద్ద విశ్వహిందూ పరిషత్ జాతీయ నాయకులు, మాజీ ఎంపీ రామ్ విలాస్ దాస్ వేదాంతి యాత్రను ప్రారంభించారు.

అక్కడి నుంచి ప్రారంభమైన యాత్ర కోటి, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్‌రోడ్, మీదుగా 12కి.మీ.ల మేర వైభవంగా కొనసాగి సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్‌కు రాత్రి 8 గంటల కు చేరింది. ఈ సందర్భంగా 17వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద పలువురు ముస్లింలు శోభాయాత్రకు స్వాగతం పలికి మతసామరస్యాన్ని చాటారు.

కాగా ఉదయం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ గౌలిగూడ రామ మందిరాన్ని సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. భక్తులు హనుమాన్ చెండాలను చేత పట్టుకుని జై హనుమాన్.. జై భజరంగబలి.. జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. పలువురు చిన్నారులు హనుమాన్, శ్రీరాముడి వేషధారణలతో యాత్రలో పాల్గొన్నారు.

ఉత్తర భారతానికి భాగ్యనగరమే ఆదర్శం

భక్తి విషయంలో ఉత్తర భారతానికి భాగ్యనగరమే ఆదర్శమని ప్రముఖ స్వామీజీ, విశ్వహిందూ పరిషత్ జాతీయ నాయకులు, మాజీ ఎంపీ రామ్ విలాస్ దాస్ వేదాంతి అన్నారు. నగరంలో బజరంగదళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ శోభాయాత్ర సందర్భంగా కోటి చౌరస్తా వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..

హిందువులు ఏది చేసినా చట్టానికి లోబడే పనిచేస్తారని, అయోధ్య రామ మందిర నిర్మాణ విషయంలో కూడా సుప్రీంకోర్టులో విజయం సాధించాక అయోధ్యలో భవ్య దివ్య రామ మందిరం నిర్మాణం చేసుకున్నామని చెప్పారు.

కార్యక్రమంలో ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ, రాష్ట్ర నాయకులు రామరాజు, పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు, దుర్గా వాహిని రాష్ట్ర కన్వీనర్ వాణి సక్కుబాయి, కుమారస్వామి, సుభాష్ చందర్ పాల్గొన్నారు. కాగా యాత్ర సందర్భంగా పలు మతపరమైన కట్టడాలకు పరదాలు కట్టి ఉండటం గమనార్హం. 

అడుగడుగునా నిఘా

గౌలిగూడ నుంచి తాడ్‌బండ్ వరకు దాదాపు 12 కిలోమీటర్ల మేర జరిగిన ఈ శోభాయాత్రపై పోలీసులు అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. 17వేల మందితో దారిపొడవునా పోలీసులు బందోబస్తు నిర్వహించడంతోపాటు, సీసీ కెమెరాలతో పర్యవేక్షించారు. అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అధికారులకు పలు సూచనలు చేశారు.