11-02-2025 12:00:00 AM
గత రెండేళ్లుగా జాతుల కలహాలతో రావణకాష్టంగా రగులున్న మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ ఆదివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో దాదాపు 2 గంటల పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమైన అనంతరం బీరెన్ సింగ్ మణిపూర్‌కు వెళ్లి రాష్ట్ర గవర్నర్ అజయ్ భల్లాను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు.
పార్టీ లోపల, వెలుపలనుండి సింగ్ తీవ్రమైన ఒత్తిడిని ఎదు ర్కొంటున్నారని, అదే ఆయన రాజీనామాకు కారణమని తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం అధికార ఎన్డీయే కూటమిలో ప్రధానమిత్ర పక్షమైన కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్‌పీపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నా బీజేపీకి అవసరమైన మెజారిటీ ఉంది.
అయితే నాయకత్వంలో మార్పును కోరుకొంటున్న పలువురు ఎమ్మెల్యేలు బలపరీక్ష పరిస్థితి తలెత్తితే పార్టీని వీడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. రెండురోజుల క్రితం ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన ఎన్డీఏ సమావేశానికి కూటమిలోని 40 మందికి పైగా సభ్యుల్లో సగం మంది డుమ్మా కొట్టారు.
మరోవైపు ఈ నెల 10నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో బీరెన్ సర్కార్‌పై అవిశ్వాసాన్ని ప్రవేశపెడతామని కాంగ్రెస్ ప్రకటించడం కూడా మరో కారణం. మణిపూర్‌లో హింసాకాండ తర్వాత ప్రతిపక్షం అధికార కూటమిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలనుకోవడం ఇదే మొదటిసారి. బీరెన్ రాజీనామా చేసిన తర్వాత గవర్నర్ సోమవారం జరగాల్సిన అసెంబ్లీ సమావేశాన్ని రద్దు చేశారు.
కాగా మణిపూర్‌లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందన్న కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ వాతావరణం తనకు అనుకూలంగా లేదన గ్రహించే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారన్నారు. హింసతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రంలో తమ పార్టీ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పూ రాకుండా ఉండడానికి కొద్దిరోజుల క్రితం బీరెన్ సింగ్‌తో పాటు ఆరుగురు కీలక ఎమ్మెల్యేలతో అమిత్ షా చర్చలు జరిపారు.
అయితే 60 మంది సభ్యులున్న మణిపూర్ అసెంబ్లీలో పేరుకు బీజేపీకి తిరుగులేని మెజారిటీయే ఉంది. కానీ ఆయన నాయకత్వంపై బీజేపీ ఎమెల్యేల అసంతృప్తి రోజురోజుకు పెరుగుతోంది. రాష్టాన్ని కాపాడుకోవాలంటే బీరెన్‌ను తప్పించడం అనివార్యమని అమిత్‌షాతో బీజేపీ నేతలంతా చెప్పినట్లు తెలుస్తోంది.
అన్నిటిన్నా మించి రాష్ట్రంలో జాతి హింసను ప్రేరేపించడంలో బీరెన్ సింగ్ హస్తం ఉందని సూచిస్తూ వెలుగులోకి వచ్చిన ఆడియో టేపులు సైతం ఆయన మెడకు చుట్టకున్నాయి.ఈ అడియో టేపుల పరిశీలనపై సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ నివేదికను సీల్డ్ కవర్‌లో సమర్పించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించడం కూడా ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చింది.
ఈ ఆడియోలో గొంతు బీరేన్ సింగ్‌దిలాగానే ఉందని ఓ ప్రైవేటు ఫోరెన్సిక్ ల్యాబ్ ఇప్పటికే ప్రకటించింది. అన్నీ కలిపి కర్ణుడి చావుకు సవాలక్ష కారణాల్లాగా బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. 2023 మార్చి 27న అప్పటి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఎంవి మురళీధరన్ మెయిటీ కమ్యూనిటీని వెంటనే రాష్ట్ర ఎస్టీ జాబితాలో చేర్చాలని ఆదేశిస్తూ ఒక ఉత్తర్వు జారీ చేశారు.
ఇది రాష్ట్రంలో జాతిహింస విస్ఫోటనకు దారితీసింది. రాష్ట్రాన్ని చుట్టుముట్టిన హింసాకాండలో ఇప్పటివరకు ఉగ్రవాదులు సహా 258 మంది ప్రాణాలు కోల్పోయారని ప్రభుత్వ ఉన్నతాధికారులే స్వయంగా ప్రకటించారు. వేలాదిమంది నిరాశ్రయులుగా మారగా, లక్షలాది మంది సురక్షిత ప్రాంతాలకు వలస వెళ్లారు. ఇంత జరిగిన తర్వాత బీరెన్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేయడం వల్ల ఒరిగేది ఏమిటని గిరిజన వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
ముఖ్యమంత్రిని మార్చితే లాభం లేదని, రాష్ట్రపతి పాలన ఒక్కటే మార్గమని వారంటున్నారు. ప్రత్యామ్నాయ ముఖ్యమంత్రి వేటలో బీజేపీ ఉన్నప్పటికీ ఆరునెలల పాటు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.