పరుగులు పెడుతున్న ఫ్యాషన్ ప్రపంచంలో రేడీమేడ్ దుస్తుల వాడకం పెరిగిపోతోంది. రోజురోజుకూ కొత్త కొత్త ఫ్యాషన్లు పుట్టుకొస్తున్నా.. మన చేనేత కళాకారులు తయారుచేసిన దుస్తులు వాటిని తట్టుకొని పోటీ ప్రపంచంలో ఉనికిని చాటుకుంటున్నాయి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు చాటేలా సరికొత్త ఫ్యాషన్ ను పరిచయం చేస్తున్నాయి. కంటికి కనిపించని వేల పోగులను ఒక్కటిచేసి రంగులతో అందాలు అద్ది, చేతి నైపుణ్యంతో అందమైన చీరలు, దుస్తులు తయారుచేస్తూ పూర్వవైభవం తీసుకొస్తున్నారు కళాకారులు. అగ్గిపెట్టెలో ఆరు గజాల చీరను ప్రపంచానికి అందించిన ఘనత మన తెలంగాణ రాష్ట్రానికి దక్కుతుంది.
మృదుత్వం, సహజత్వం, నాణ్యత, మన్నిక, సంస్కృతి, సంప్రదాయం చేనేతలోనే ఉన్నాయి. అయితే చేనేతకు ఆదరణ తగ్గుతున్న క్రమంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీ వరకు చేనేత వస్త్రాలనే ధరిస్తూ ఆ సోయగంతో మురిసిపోతున్నారు. పార్టీలు, ఫంక్షన్లలో ఆ దుస్తులను ధరిస్తున్నారు. ఈక్రమంలో పోచంపల్లి చేనేత ఇక్కత్, గద్వాల చీరలు, ఇతర దుస్తులు సరికొత్త స్టైలులో ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో తెలంగాణ చేనేత హస్తకళల ప్రదర్శన కనువిందు చేస్తోంది. ఒకసారి మీరు ఈ చేనేత దుస్తులను ధరించి బ్రాండ్ వ్యాల్యూను చాటండి మరి.