calender_icon.png 23 October, 2024 | 8:59 AM

సంక్షోభంలో చేనేత రంగం

07-08-2024 01:29:38 AM

  1. సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ మంగళం 
  2. మార్కెట్‌లో డిమాండ్ ఉన్నా ఉపాధి కరువు 
  3. ప్రభుత్వాలు మారుతున్న మారని నేతన్న బతుకు 
  4. నేడు జాతీయ చేనేత దినోత్సవం 

చేనేత వస్త్రాలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్నప్పటికీ చేనేత కార్మికులకు రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాలు మారుతున్నా చేనేతల జీవితాల్లో వెలుగులు మాత్రం కనిపించడం లేదు. నెలలు తరబడి చీరను తయారు చేస్తే వచ్చే కొద్దిపాటి డబ్బుతో జీవనం భారమవుతున్నది. నేతన్నల ఆకలిదప్పులను తీర్చలేక పోతున్నాన్న వేదనలతో మగ్గాలు దర్శనమిస్తున్నాయి. కుటుంబాలు మొత్తం చేనేత వృత్తిని నమ్ముకుని జీవనాన్ని సాగించే తరుణం నుంచి నేడు మగ్గాలను నమ్ముకుని దుర్భరమైన జీవితాన్ని సాగదీసున్నారు. నేడు జాతీయ చేనేత దినోత్సవం  సందర్భంగా విజయక్రాంతి అందిస్తున్న ప్రత్యేక కథనం.

వనపర్తి, ఆగస్టు 6 (విజయక్రాంతి): వనపర్తి జిల్లాలోని కొత్తకోట, అమరచింత మున్సిపాలిటీలు, గద్వాల జిల్లా కేంద్రంతో పాటు అయిజ, రాజోళి, గట్టు మండలాలు చేనేత వస్త్రాల తయారీకి పుట్టినిల్లు. ఏళ్ల తరబడి మగ్గాలపై వివిధ ఆకృ తులు, డిజైన్లతో తయారు చేసిన చీరలు దేశంలోని నలుమూలలకు చేరుతున్నాయి. వనపర్తి, గద్వాల జిల్లాలో 8,100 మంది కార్మికులు ఉన్నారు. 

ఒక్క చీర తయారీకి మూడు నెలలు..

చేనేత కార్మికులు కాటన్‌తో తయారు చేసిన చీరలు మహిళలకు హుందాతనా న్ని తెస్తాయి. దుకాణ యజమానుల నుంచి ముడి సరుకును ఇస్తే చేనేత కార్మికులు తమ ఇళ్లలో నేస్తారు. ఒక్కో చీర తయారీకి నెల నుంచి మూడు నెలల పడుతుంది. 

చేనేత పథకాలు మంగళం 

చేనేత కార్మికులకు అందించాల్సిన పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడుతున్న దన్న విమర్శలొస్తున్నాయి. షిఫ్ట్ ఫండ్ పథకం: ఈ పథకం కింద చేనే త కార్మికులు తాము సంపాదించిన డబ్బు లో 8 శాతం ఆర్డి అకౌంట్ 1 ద్వారా జమ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆర్డి 2 ద్వారా 16 శాతం కలిపి వేయాలి. గత బీఆర్‌ఎస్ హయాంలో గడిచిన 5 ఏండ్ల కాలంలో 36 నెలలు మాత్ర మే రాగా.. ప్రస్తుతం 8 నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు. 

చేనేత మిత్ర: చేనేత కార్మికులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ముడిసరుకును 15 శాతం రాయితీ మీద ఇస్తే రాష్ట్ర ప్రభు త్వం 50 శాతం కలిపి ఇవ్వాలి. ఈ రాయితీ అనేది 45 రోజులకు ఒకసారి ఇవ్వాల్సి ఉంటుంది. గడిచిన 5 ఏండ్ల కాలంలో కేవ లం ఆరుసార్లు ఇవ్వగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం చేనేత మిత్ర జాడనే లేదు. 

చేనేత బీమా: వ్యవసాయం చేసే రైతన్నలకు మద్దతుగా గత ప్రభుత్వం రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ఆగస్టు 15 నాటికి పూర్తి అవుతుందని, తిరిగి రెన్యూవల్ చేయాలన్న ఆలోచన కాంగ్రెస్ చేయడం లేదని కార్మికులు వాపోతున్నారు. 

చేనేత రుణమాఫీ: చేనేత రుణమాఫీ పథకం కింద కార్మికులు రూ.50 వేల నుంచి రూ.కోటి రుణాలు తీసుకున్నారు. 5 ఏండ్ల కిందట రూ.16 కోట్లు మంజూరు చేయగా అందులో రూ.50వేలు రుణాలను తీసుకున్న వారికి మాఫీ అయ్యాయి. రూ.లక్ష రుణం తీసుకున్న వారిని పట్టించుకోలేదు. కాంగ్రెస్ రుణమాఫీ ఊసే ఎత్తడం లేదు. 

250 సంఘాలకు మిగిలింది 20 సంఘాలే..

కరీంనగర్(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలో చేనేత రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. కరీంనగర్ జిల్లా లో ఒకప్పుడు చేనేత పారిశ్రామిక సహకార సంఘాలు 250 ఉండగా, ప్రస్తుతం 20 సంఘాలు మాత్రమే ఉన్నాయి. ఈ సంఘాల పరిధిలో 1,413 మంది కార్మికులు ఉన్నారు. సహకారేతర రంగంలో 220 మంది మాత్రమే ఉన్నారు. గత 8 సంవత్సరాలుగా చేనేత సహకార సం ఘానికి ఎన్నికలు నిర్వహించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో తగిన నిధులు కేటాయించకపోవడం ఆందోళన కలిగిస్తున్న అంశం.

ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న నేత కార్మికులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. కరీం నగర్ జిల్లాలో త్రిస్ట్ ఫండ్ పథకం ద్వారా 15 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా గా 2021 నుంచి 2023 వరకు 1,582 మంది లబ్ధి పొందారు. 2024 సంవత్సరంలో ఈ పథకం అమలు ఇంకా మొదలు కాలేదు. రుణ పరపతి సౌకర్యం కింద ఈ సంవత్సరానికి జిల్లాలో 19 చేనేత పరిశ్రమ సంఘాలకు రూ.479 లక్షల మంజూరు కోసం జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు సిఫారసు చేశారు. ఇది అమలు కావాల్సి ఉంది. జిల్లాలో 1,112 యూనిట్లలో 3,558 మరమగ్గాల సభ్యులు పనిచేస్తున్నారు. మరమగ్గాలకు 50 శాతం విద్యుత్ సబ్సిడీ ఫైల్ ప్రభుత్వం వద్ద ఉన్నది. 

సంక్షోభం నుంచి గట్టెక్కించండి

చేనేత రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. నూలు సబ్సి డీలో పాత విధా నం ప్రకారం 30 శాతం యథావిధి గా కొనసాగించాలి. చేనేత కార్మికుల స్థితిగతులను మెరుగుపర్చడానికి మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేయాలి. ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలి. 

 వాసాల రమేశ్, గౌరవాధ్యక్షుడు, పద్మశాలీ సంఘం, కరీంనగర్ జిల్లా 


ప్రత్యేక శిక్షణ ఇప్పించాలి

తెలంగాణ ప్రభుత్వం ద్వారా నైపుణ్యాభివృద్ధి కోసం నిర్వహించబడుతున్న టాస్క్ ద్వారా చేనేత కుటుంబాల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించే కోర్సులు ప్రవేశపెట్టాలి. చేనేత వస్త్రాల అమ్మకానికి ఎగ్జిబి షన్లు ఏర్పాటు చేయాలి. ఉపాధి కోసం సబ్సిడీతో కూడిన రుణ సౌకర్యం కల్పించాలి. టెస్కోకు ప్రభుత్వం ద్వారా వెయ్యి కోట్ల మూల నిధిని కేటాయించాలి. 

 మెతుకు సత్యం, 

రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, 

పద్మశాలీ సంఘం (కరీంనగర్)

అన్ని పథకాలు అమలు చేయాలి

చేనేత కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి పథకాన్ని పక్కాగా అమలు చేయాలి. చేనేత కార్మికుల ఉపాధి కోసం వర్క్‌షెడ్లను ఏర్పాటు చేయాలని పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా ఎలాంటి ఫలితం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని వర్క్ షెడ్లను ఏర్పాటు చేయాలి. చేనేత మిత్ర, చేనేత బీమా, చేనేత రుణమాఫీ, షిఫ్ట్ ఫండ్ పథకాలను అమలు చేయాలి. 

 చంద్రమోహన్, అమరచింత చేనేత సహకార సంఘం అధ్యక్షుడు