calender_icon.png 11 January, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.168 కోట్లతో చేనేత అభయహస్తం

11-01-2025 12:48:53 AM

పథకం అమలుకు సీఎం రేవంత్ ఆమోదం

హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): రాష్ట్రంలోని చేనేత, మర మగ్గ కార్మికుల సంక్షేమం, సమగ్రాభివృద్ధి కోసం రూ.168 కోట్లతో చేనేత అభయహస్తం పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని ఆమోదించినందుకు సీఎం రేవంత్‌రెడ్డికు మంత్రి తుమ్మ ల ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షే మం, అభివృద్ధికి కట్టుబడి ఉందనేందుకు ఇదొక ఉదాహరణ మాత్రమే నన్నారు.

ఈ పథకం ద్వారా తెలంగా ణ నేతన్న పొదుపు (పొదుపు నిధి), తెలంగాణ నేతన్న భద్రత (నేతన్న బీమా), తెలంగాణ నేతన్నకు భరోసాలు అమలు చేస్తామన్నారు. నేతన్న పొదుపు కోసం బడ్జెట్లో రూ.115 కోట్లు, నేతన్న భద్రత కోసం రూ.9 కోట్లు, నేతన్న భరోసా పథకానికి రూ.44 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. 

నేతన్న పొదుపు నిధి..

తెలంగాణ నేతన్న పొదుపు (పొదుపు నిధి) ద్వారా చేనేత కార్మికులు తమ వాటాగా 8 శాతం పొదుపు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం 16 శాతం వాటా జమ చేస్తుందని, దీని ద్వారా దాదాపు 38,000 మంది చేనేత కార్మికులు లబ్ధిపొందుతారని మంత్రి తెలిపారు. పవర్ లూమ్ కార్మికులు 8 శాతం పొదుపు చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం 8 శాతం వాటా జమ చేస్తుందని, తద్వారా దాదాపు 15,000 మంది పవర్ లూమ్ కార్మికులు లబ్ధి పొందే అవకాశం ఉందన్నారు. 

నేతన్న భద్రత బీమా..

తెలంగాణ నేతన్న భద్రత (నేతన్న బీమా) ద్వారా చేనేత, పవర్ లూమ్ కార్మికులు, అనుబంధ కార్మికులందరికీ జీవిత బీమా అందిస్తామని, నమోదు చేసుకున్న కార్మికులు ఏ కారణంతోనైనా మరణిస్తే, నామినీకి రూ.5 లక్షలు చెల్లిస్తామని తుమ్మల వివరించారు.

నేతన్న భరోసా..

తెలంగాణ నేతన్నకు భరోసా ద్వారా చేనేత కార్మికులు తెలంగాణ మార్క్ లేబుల్‌ను ఉపయోగించి తయారుచేసిన తెలంగాణ వస్త్ర ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు, వేతన మద్దతు అందించేలా.. పని ఆధారంగా ఏడాదికిఒక్కొక్క చేనేత కార్మికుడికి రూ.18,000 వరకు, అనుబంధ కార్మికుడికి రూ.6,000 వరకు మంజూరు చేస్తామన్నారు.

ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే చేనేత రంగానికి రూ.874 కోట్లు విడుదల చేశామని మంత్రి అన్నారు. అందులో గత ప్రభుత్వం బకాయి పెట్టినవే రూ.465 కోట్లు ఉన్నాయని గుర్తుచేశారు. నేతన్నలకు నిరంతరం పని కల్పించాలనే ఉద్ధేశంతో అన్నీ ప్రభుత్వ శాఖలు/కార్పొరేషన్/సొసైటీలు తప్పనిసరిగా తమకు కావాల్సిన వస్త్రాలను  టెస్కో ద్వారానే కొనుగోలు చేసేలా జీవో నెం.1 తీసుకొచ్చామన్నారు.

ఇందిరా మహిళా శక్తి చీరల పథకాన్ని సైతం అమలుచేస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా చేనేత కార్మికుల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో రూ.50 కోట్ల కార్పస్ ఫండ్‌తో నూలు డిపోను ఏర్పాటు చేసామని, నేతన్నకు చేయూత కింద చేనేత కార్మికులకు రూ.290.09 కోట్లు విడుదల చేశామన్నారు.

రూ.22.25 కోట్ల నిధులతో నేతన్న బీమా, పావలవడ్డీ పథకం కింద 60 చేనేత సహకార సంఘాలకు రూ.1.09 కోట్లు, మరమగ్గ కార్మికులకు 10 శాతం నూలు సబ్సడీ పథకం కింద 2018 నుంచి 2022 వరకు ఉన్న రూ.37.49 కోట్ల బకాయిలను ఈ ఏడాదిలోనే విడుదల చేశామన్నారు. ఇదిలా ఉండగా చేనేత అభయహస్తం పథకానికి సంబంధించిన జీవోను ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ శుక్రవారం విడుదల చేశారు.