calender_icon.png 14 October, 2024 | 3:49 PM

దివ్యాంగుల జాబ్ పోర్టల్ ఆవిష్కరించిన మంత్రి సీతక్క

14-10-2024 01:46:12 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): దివ్యాంగుల జాబ్ పోర్టల్ ను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఉపాధి రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇతర వర్గాలవారిలా పోరాటం చేయాలంటే దివ్యాంగులు ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటున్నారు.

శారీరక లోపం అనేది వారి చేతిలో లేని పరిస్థితి, ఇది పోషకాహార లోపం లేదా ప్రమాదం వల్ల కలగవచ్చు. వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఆన్లైన్ జాబ్ పోర్టల్‌ను ప్రారంభిస్తున్నాము. ఇకపై  దివ్యాంగులు కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ఆన్ లైన్ జాబ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుంటే అర్హత ప్రకారం ఉద్యోగాలు వస్తాయని సీతక్క పేర్కొన్నారు. సంక్షేమ నిధుల్లో దివ్యాంగుల కోసం 5 శాతం కేటాయిస్తున్నామని చెప్పారు.

ప్రైవేట్ ఉద్యోగాల్లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్లు పాటించాలని మంత్రి సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు, ఇతర పథకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు ఉంటాయని, వారి పరికరాలకు బడ్జెట్ లో రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. త్వరలో దివ్యాంగుల బ్యాక్ లాగు పోస్టులు భార్తీ చేస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళా సంక్షేమ శాఖ డైరెక్టరెట్ హెల్ప్ లైన్ లో 10 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేశారు.