calender_icon.png 1 November, 2024 | 10:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌కు హ్యాండిచ్చి.. కారెక్కిన బండ్ల

31-07-2024 12:25:43 AM

సొంతగూటికి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి

కాంగ్రెస్‌లో పొసగకనే యూటర్న్ అంటూ ప్రచారం

నియోజకవర్గంలో అనుచరులపై పోలీసుల వేధింపులు

అభివృద్ధి నిధులు అడగొద్దని పార్టీ సీనియర్ల సూచనలు

ఆయన బాటలో మరో నలుగురు ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లోకి..?

హైదరాబాద్/గద్వాల, జూలై 30 (విజయక్రాంతి): గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌కు ఊహించని షాక్ ఇచ్చారు.  మంగళవారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి పార్టీలో కొనసాగుతానని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. అసెంబ్లీ అవరణలో కృష్ణమోహన్‌రెడ్డి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి సరదాగా మాట్లాడారు. ఓవైపు అధికార కాంగ్రెస్‌లోకి ఒక్కొక్కరుగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చేరుతున్నారు.

ఈ తరుణంలో చోటుచేసుకున్న అనుహ్య పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. బీఆర్‌ఎస్ నుంచి ఇప్పటివరకు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరగా.. కృష్ణమోహన్‌రెడ్డి తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆ సంఖ్య తొమ్మిదికి చేరింది. కాంగ్రెస్ చేరిన వారిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రా వు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, కాలేరు యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి ఉన్నారు. మరికొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు త్వరలో కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి యూటర్న్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

స్థానిక కాంగ్రెస్ నేతలు నియోజకవర్గంలో ఆయనపై విమర్శలు చేయడం, బండ్ల అనుచరులను పోలీసులు వేధింపులకు గురిచేయడం వంటి సమస్యలతో కాంగ్రెస్ కంటే బీఆర్‌ఎస్సే బెటర్ అనే ఆలోచనతో ఆయన సొంతగూటికి వచ్చినట్టు తెలుస్తుంది. అభివృద్ధి నిధుల కోసం సీఎం కార్యాలయానికి ఫైల్ తీసుకుని వెళ్తే వాటి గురించి అడగొద్దని సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతం త మాత్రమే ఉందని, ఇలాంటి సమయంలో నిధుల మాట ఎత్తవద్దని ఆ పార్టీ సీనియర్లు హెచ్చరించినట్టు సమాచారం. ఇలాంటి తరుణంలో అదికార పార్టీ కంటే ప్రతిపక్షంలో ఉంటేనే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే, కృష్ణమోహన్‌రెడ్డిని కేసీఆరే కాంగ్రెస్‌లోకి పంపారని మరికొందరు వాదిస్తున్నారు. ఇలా చేస్తే కాంగ్రెస్‌లోకి వలసలు తగ్గుతాయని అంటున్నారు. 

గూలాబీ గూటికి మరో నలుగురు ఎమ్మెల్యేలు? 

నియోజకవర్గ అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరామని చెప్పిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు అక్కడ చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ కండువా కప్పుకొన్న మరుసటి రోజు నుంచి తమ ను పట్టించుకునే నాథుడే లేదని, అంటరాని వారిగా చూస్తున్నారని పలువురు ఎమ్మెల్యేలు తమ అనుచరుల వద్ద చెప్పుకొన్నట్టు తెలిసింది. తాజాగా బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి సొంత గూటికి రావడంతో ఆయన బాటలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూ డెం మహిపాల్‌రెడ్డి బీఆర్‌ఎస్‌లోకి వస్తారని ప్రచారం జోరందుకున్నది.  భద్రాచ లం ఎమ్మెల్యే తెల్లం వెంక్రటావు మంగళవారం అసెంబ్లీ ఆవరణలోని కేసీఆర్ చాంబర్‌కు ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మల్లారెడ్డితో వెళ్లి మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. అనంత రం ఇద్దరు కలిసి బయటకు వచ్చి తిరగడంతో ఆయన కూడా బీఆర్‌ఎస్‌కు వస్తా రని ప్రచారం జరుగుతుంది.