నేటి నుంచి వరల్డ్ బ్లిట్జ్ చాంపియన్‌షిప్
న్యూయార్క్: ఫిడే వరల్డ్ ర్యాపిడ్ చెస్ టైటిల్‌ను రెండోసారి నెగ్గి చరిత్ర సృష్టించిన భారత చెస్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లోనూ అదే జోరు కనబరచాలని ఆశిస్తోంది. నేటి నుంచి మొదలుకానున్న బ్లిట్జ్ చాంపియన్‌షిప్‌లో హంపి ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఆదివారం ముగిసిన ర్యాపిడ్ చాంపియన్‌షిప్ చివరి రౌండ్‌లో ఇండోనేషియాకు చెందిన ఇరినే సుకందర్‌ను ఓడించిన హంపి రెండోసారి విజేతగా నిలిచింది.
ఇక బ్లిట్జ్‌లో కూడా విజేతగా నిలిస్తే ఒకే టోర్నీలో ర్యాపిడ్, బ్లిట్జ్ గెలిచిన క్రీడాకారిణిగా హంపి రికార్డు సృష్టించనుంది. మహిళల విభాగంలో హంపితో పాటు మరో తెలుగు తేజం ద్రోణవల్లి హారిక, ఆర్. వైశాలీ, దివ్య దేశ్‌ముఖ్ పోటీలో ఉన్నారు.
ఓపెన్ సెక్షన్ విభాగంలో ఆర్. ప్రజ్ఞానంద, అర్జున్ ఇరిగేసితో పాటు అలీరెజా ఫిరౌజా, అబ్దుసత్రోవ్ బరిలో ఉన్నారు. ఓపెన్ సెక్షన్ విభాగంలో 13 రౌండ్లు.. మహిళల విభాగంలో 11 రౌండ్లు జరగనున్నాయి. ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సన్ పోటీకి దూరమయ్యాడు.