ఇస్మాయిల్ హనియే టెహ్రాన్‌లో కాల్చివేత
ఇజ్రాయెల్‌పై ఊగిపోతున్న అరబ్ ప్రపంచం
ప్రతీకారం తప్పదన్న ఇరాన్
టెహ్రాన్, జూలై 31: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన గూఢచారి సంస్థగా గుర్తింపు పొందిన ఇజ్రాయెల్ సంస్థ మొసాద్ మరోసారి తన మార్కు చూపించింది. ఇజ్రాయెల్‌కు ప్రబల శత్రువైన ఇరాన్‌లో అంతకంటే ఆగర్భ శత్రువైన పాలస్తీనా సంస్థ హమాస్ టాప్ లీడర్‌ను మట్టుబెట్టింది. బుధవారం తెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో హమాస్ రాజకీయ వ్యవహారాల అధిపతి ఇస్మాయిల్ హనియేను ఆయన ఇంట్లోనే గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఇది ఇజ్రాయెల్ పనేనని ఇరాన్ ఆరోపించింది. 8 నెలలుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ ఘర్షణ ఈ హత్యతో కొత్త మలుపు తిరిగే ప్రమాదం కనిపిస్తున్నది.
మోసాద్ మార్క్ హత్య
పాలస్తీనా స్వతంత్ర దేశం కోసం పోరాడుతున్న హమాస్‌కు ఇజ్రాయెల్‌కు మధ్య 8 నెలలుగా భీకర ఘర్షణలు జరుగుతున్న విషయం తెలిసిందే. గాజాలో హమాస్ నెట్‌వర్క్ మొత్తాన్ని నాశనం చేయకుండా దాడి ఆపేది లేదని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. అందులో భాగంగా ఆ సంస్థ అగ్రనేతలపే దృష్టిపెట్టింది. ఖతార్‌లో నివసిస్తూ హమాస్‌కు ప్రపంచ వ్యాప్తంగా మద్దతు కూడగడుతున్న హనియే ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసౌద్ పెజెస్కియాన్ ప్రమాణ స్వీకారం కోసం ఆయన ఇటీవలే టెహ్రాన్ వచ్చారు. దీంతో టెహ్రాన్‌లోని మొసాద్ ఏజెంట్లు బుధవారం రాత్రి 2 గంటల సమయంలో హనియే ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో హనియేతోపాటు ఆయన అంగరక్షకుడు ఒకరు చనిపోయాడు. ఖాలెద్ మెషాల్ అనంతరం హమాస్ అధిపతిగా 2017లో హనియే నియమితుడయ్యాడు. ఆయన 1987లో హమాస్‌లో చేరాడు.
పక్కా వ్యూహంతో
రెండురోజుల క్రితం హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడి చేయటంతో గోలన్ హైట్స్‌లోని ఓ ఫుట్‌బాల్ స్టేడియంలో ఆడుకొంటున్న 12 మంది చిన్నారులు చనిపోయారు. ఈ దాడికి ప్రతీకారం తప్పదని ఇజ్రాయెల్ ఆ రోజే ప్రకటించింది. బుధవారం రాత్రి లెబనాన్ రాజధాని బీరుట్‌పై క్షిపణులతో విరుచుకుపడింది. అక్కడ నివాసం ఉంటున్న హెజ్బొల్లా టాప్ కమాండ్‌ను చంపటమే లక్ష్యంగా ఈ దాడి జరిగింది. ఈ దాడిలో హెజ్బొల్లా కమాండర్ ఇమాద్ ముగ్నియే మరణించాడు. సరిగ్గా అదే సమయంలో టెహ్రాన్‌లోని హనియే ఇంటిపై మొసాద్ ఏజెంట్లు దాడి చేశారు. ఈ దాడిని ఎవరూ ఊహించలేదు. హనియే హత్యతో ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణ పూర్తిస్థాయి యుద్ధంగా మారే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ ఘర్షణల్లో వేలమంది అమాయకులు చనిపోతుండటం, అందుకు ఇజ్రాయెల్ ఏమాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయకపోవటంతో దాని చుట్టూ ఉన్న అరబ్ దేశాలన్నీ ఒక్కటవుతున్నాయి.
ప్రతీకారం తప్పదు
హనియే హత్యపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ‘హనియే హంతకులను అంతమొందించటం మా కర్తవ్యం’ అని ఇరాన్ సుప్రీంలీడర్ అయొతొల్లా అలీ ఖొమేనీ ప్రకటించారు. హనియే హత్య నేపథ్యంలో ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఖొమేనీ నివాసంలో బుధవారం అత్యవసరంగా సమావేశమైంది.హనియే అంతక్రియలు గురువారం టెహ్రాన్‌లో నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. ఇరాన్‌లో మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. హనియే హత్యపై అరబ్ దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఇరాక్, లెబనాన్, ఖతార్, టర్కీ, ఈజిప్ట్, చైనా తదితర దేశాలు ఇజ్రాయెల్ చర్యను ఖండించాయి. ఇజ్రాయెల్ అత్యంత తీవ్ర నేరానికి పాల్పడిందని ఆగ్రహం వ్యక్తంచేశాయి. హనియే హత్యతో ఇజ్రాయెల్‌లో సంబురాలు చేసుకొంటున్నారు.