ఇజ్రాయెల్‌గాజా యుద్ధం ముగింపు దశకు చేరుకొన్నట్టే కనిపిస్తున్నది. ఏడాదికి పైగా జరుగుతున్న యుద్ధంలో హమాస్ కీలక నేతలను ఇజ్రాయెల్ తుడిచి పెట్టింది. ఇస్మాయిల్ హనియే, యాహ్యా సిన్వర్ మరణంతో హమాస్ ఉనికి కోల్పోయినట్టేనని భావిస్తున్నారు.
కానీ, ఇజ్రాయెల్ మాత్రం యుద్ధాన్ని ఆపుతామని ఎలాంటి ప్రకటనా చేయలేదు. హమాస్‌కు సుదీర్ఘ పోరాట చరిత్ర ఉన్నది. నాయకత్వాన్ని కోల్పోవటం కొత్తేమీ కాదు. కానీ, ఇప్పుడు జరుగుతున్న పోరాటం గతంలో కంటే భిన్నంగా, భీకరంగా ఉన్నది. ఇకపై హమాస్, గాజా సమస్యే ఉండకూడదన్న ఉద్దేశం ఇజ్రాయెల్ చర్యల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. గాజాను పూర్తిగా ఆక్రమించుకోవటమో.. లేదంటే చివరి హమాస్ మిలిటెంట్‌ను అంతం చేయటమో లక్ష్యంగా ఇజ్రాయెల్ దూకుడు ప్రదర్శి స్తోంది. ఆ తర్వాతే ఇజ్రాయెల్ శాంతించే పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు హెజ్బొల్లానూ తీవ్రంగా దెబ్బతీసింది. ఆ సంస్థ అధినేత హసన్ నస్రల్లాను చంపేసింది. హెజ్బొల్లా డిఫ్యూటీ చీఫ్ నయీమ్ ఖాసీం కూడా చావు భయంతో ఇరాన్ పారిపోయాడని వార్తలు వచ్చాయి. ఇరాన్ అతడికి రక్షణ కల్పించిందనే వాదన కూడా ఉన్నది. ఇస్మాయిల్ హనియేను ఏకం గా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోనే కట్టుదిట్టమైన భద్రత ఉన్న ప్రాంతంలో ఇజ్రాయెల్ గురితప్పకుండా చంపేసింది. హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా భూమికి 60 అడుగుల లోతులో బంకర్‌లో దాక్కున్నప్పటికీ హతమార్చింది. ఇప్పుడు ఈ రెండు సంస్థల్లో మిగిలిన నాయకత్వాన్ని అయినా రక్షించాలని ఇరాన్ భావిస్తున్నట్లు కనిపిస్తున్నది.
గాజా, పాలస్తీనా సమస్య ఉన్నంత కాలం ఇలాంటి సంస్థల మనుగడ కొనసాగుతూనే ఉంటుంది. హమాస్ కాకపోతే మరో సంస్థ. కాకపోతే బలాల్లో తేడాలు ఉంటాయంతే. హమాస్ పుంజుకోవటానికి సమయం పట్టవచ్చు. ఇజ్రాయెల్‌తో పోరాడుతున్న హమాస్, హెజ్బొల్లా నాయకత్వమంతా యుద్ధ బాధిత శిశువులే. దశాబ్దాలుగా సాగుతున్న యుద్ధం వల్ల లక్షల మంది శరణార్థి శిబిరాల్లో అత్యంత దారిద్రభరిత జీవితం గడుపుతున్నారు. అలాంటి ఒక శరణార్థి శిబిరంలోనే పుట్టిన యాహ్యా సిన్వర్ మరణించాడు. ప్రస్తుత యుద్ధం వల్ల ఇప్పటికే 50 వేల మంది చనిపోగా, లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారు. హమాస్ లాంటి సంస్థలు, సిన్వర్ వంటి కరుడుగట్టిన ఉగ్రనేతలు పుట్టుకు రావటానికి ఇంతకంటే ఉత్తమ ప్రదేశాలు ఉండవు. ఇజ్రాయెల్ పంతం ప్రకారం హమాస్‌ను అంతం చేస్తుంది. హెజ్బొల్లాను తుడిచేస్తుంది. మరి తర్వాత? ఈ రెండు సంస్థల అధికారం కింద ఉన్న లక్షలమంది ఎటు వెళ్తారు? వారికి ఏ దేశం ఆశ్రయం ఇస్తుంది? ప్రపంచంలో జన సాంద్రత, పేదరికం ఉన్న ప్రదేశాల్లో గాజా ముందు వరుసలో ఉన్నది.
శరణార్థుల సమస్య పెరిగితే పశ్చిమాసియాలో అన్ని దేశాలకు ప్రమాదమే. ఈ శిబిరాల నుంచే హింసాత్మక ఉగ్రవాద సంస్థలు పుట్టుకొస్తాయి. అందుకే పాలస్తీనా, లెబనాన్‌లలోని ప్రజలను ఇతర దేశాలు లోపలికి రానీయటం లేదు. కానీ, మున్ముందు అరబ్ దేశాలన్నీ ఒక్కటై ఇజ్రాయెల్‌పైకి వెళ్తే అది ప్రపంచ సమస్యగా మారుతుంది. ఇప్పటికే పర్షియన్ గల్ఫ్‌లో హుతీ ఉగ్రవాదులు అంతర్జాతీయ వాణిజ్యానికి పెద్ద తలనొప్పిగా మారారు. ఆఫ్రికాలో పదిహేనేళ్ల క్రితం వచ్చిన జాస్మిన్ తిరుగుబాటులో గఢాపీ, సద్దాం హుస్సేన్ వంటివారు అంతమై పోయారు. కానీ, వారి స్థానంలో ఇప్పటికీ బలమైన, స్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడలేదు. లిబియా, ట్యునీషియా, ఇరాక్‌లో అరాచకం రాజ్యమేలుతూనే ఉన్నది. అగ్రరాజ్యాలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు గాజా, లెబనాన్‌లోనూ అదే జరుగుతుంది. వీలైతే హమాస్‌ను, హెజ్బొల్లాను పూర్తిగా నాశనం చేసి ఇజ్రాయెల్ తన దారిన తాను పోతుంది. ఒకవేళ మరో ఐదారేండ్ల తర్వాత హమాస్, హెజ్బొల్లా మళ్లీ పుంజుకొంటే ఇజ్రాయెల్ మళ్లీ యుద్ధం చేస్తుందా? అసలైన సమస్యను పరిష్కరించకుండా పైపైన పోరాటాలతో ప్రపంచానికి ముప్పు మరింత పెరుగుతుందే కాని తగ్గదు.