calender_icon.png 21 October, 2024 | 1:42 AM

హమాస్ చీఫ్ హతం

18-10-2024 01:47:54 AM

టెల్ అవీవ్,అక్టోబర్ 17: ఏడాది కాలంగా సాగుతున్న ఇజ్రాయెల్ యుద్ధంలో ఇజ్రాయెల్ సైన్యం మరో ఘన విజయం సొంతం చేసుకొన్నది. హమాస్ ఉగ్రవాద సంస్థ అధినేత యాహ్యా సిన్వర్‌ను మట్టుబెనట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ప్రకటించింది. సిన్వర్ మృతదేహానికి డీఎన్‌ఏ పరీక్షలు చేసి మరీ ఈ విషయాన్ని ధృవీకరించింది. గత ఏడాది అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ భీకర దాడికి ప్రణాళిక వేసింది సిన్వరేనని ఇజ్రాయెల్ ఆరోపిస్తున్నది. 

ఆ దాడిలో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. వందల మందిని హమాస్ ఉగ్రవాదులు బందీలుగా గాజా ప్రాంతానికి పట్టుకెళ్లారు. సిన్వర్ మృతిని మొదట ఇజ్రాయెల్ సైన్యం కచ్చితంగా ధృవీకరించలేదు. ‘గాజాలో ఐడీఎఫ్ ఇటీవల చేపట్టిన ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు. వారిలో ఒకరు యాహ్యా సిన్వర్ అని అనుమానిస్తున్నాం. అదే విషయాన్ని ఐడీఎఫ్, ఇజ్రాయెల్ సెక్యూరిటీస్ అథారిటీ పరిశీలిస్తున్నాయి. అయితే, ఇప్పటికిప్పుడు ఆ ముగ్గురు ఉగ్రవాదులు ఎవరు అనేది గుర్తించలేకపోతున్నాం’ అని ఐడీఎఫ్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. గురువారం రాత్రి డీఎన్‌ఏ పరీక్షల అనంతరం సిన్వర్‌ను చంపేసినట్లు  ప్రకటించింది.  

డీఎన్‌ఏ పరీక్షలకు మృతదేహాలు

ఐడీఎఫ్ దాడిలో చనిపోయిన  ముగ్గురు ఉగ్రవాదుల మృతదేహాలకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించేందుకు వాటిని ఇజ్రాయెల్‌కు తరలించినట్లు ఆ దేశ అధికారులు మొదట తెలిపారు. ఇజ్రాయెల్‌పై దాడికి ముందు నుంచే సిన్వర్ బయటి ప్రపంచంలో కనిపించటం మానేశారు. గాజా మెట్రోగా పిలిచే సొరంగాల్లో రహస్య జీవితం గడుపుతున్నారు. ఐడీఎఫ్ ప్రకటనకు ముందే ఈ అంశాన్ని ఆ దేశ రక్షణ మంత్రి యోవ్ గాల్లాంట్ పరోక్షంగా తెలిపారు.

యూదుల పవిత్ర గ్రంథం తోరాలోని వాక్యాలను పేర్కొంటూ ‘ఇజ్రాయెల్ శత్రువులు ఎక్కడా దాక్కోలేరు. నీ శత్రువులను వెంబడించు. నీ కరవాలం ధాటికి వాళ్లు నీ ముందు మోకరిల్లుతారు’ అని ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియేను జూలైలో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఇజ్రాయెల్ చంపివేసిన తర్వాత ఆ సంస్థకు సిన్వర్ అధిపతి అయ్యారు. 1980 దశకంలో హమాస్‌లో చేరిన సిన్వర్, 1998లో ఇజ్రాయెల్‌కు పట్టుబడి అప్పటి నుంచి ఆ దేశంలోని జైల్లోనే మగ్గారు. 2011లో ఖైదీల అప్పగింతలో భాగంగా అతడిని ఇజ్రాయెల్ విడుదల చేసింది. హమాస్ సైనిక విభాగం అల్ కసమ్ బ్రిగేడ్స్‌ను శక్తిమంతంగా మార్చటంలో సిన్వర్‌దే కీలక పాత్ర.