calender_icon.png 14 March, 2025 | 3:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బందీల విడుదలకు హమాస్ అంగీకారం

07-07-2024 02:02:18 AM

గాజా సంక్షోభంలో కీలక పరిణామం

అమెరికా ప్రతిపాదనలకు హమాస్ సానుకూలం

న్యూఢిల్లీ, జూలై 6 : గత తొమ్మిది నెలలుగా కొనసాగుతున్న గాజా యుద్ధానికి ముగించే దిశగా తొలి అడుగు పడింది. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడంపై చర్చలు ప్రారంభించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ప్రతిపాదనపై హమాస్ సానుకూలంగా స్పందించింది. ఇజ్రాయెల్ బందీల విడుదలపై చర్చలకు అంగీకారం తెలిపినట్లు రాయిటర్స్ ఓ కథనం ప్రచురించింది.

“తొలి దశ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత మా వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ ప్రజలను విడుదల చేస్తాం. అయితే, ఒప్పందంలోకి ప్రవేశించేందుకు ముందు ఒక షరతు విధిస్తున్నాం. శాశ్వత కాల్పుల ఒప్పందంపై ఇజ్రాయెల్ తప్పకుండా సంతకం చేయాలి.” అని హమాస్ సీనియర్ కమాండర్ చెప్పినట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. ఈ ప్రతిపాదనను ఇజ్రాయెల్ అంగీకరిస్తే గతేడాది అక్టోబర్ 7న ప్రారంభమైన గాజా యుద్ధానికి పుల్‌స్టాప్ పడినట్టేనని ఇజ్రాయెల్ మధ్య దౌత్యం వహిస్తున్న పాలస్తీనా అధికారి పేర్కొన్నారు. 

అమెరికా ఒప్పందంలోని అంశాలివే..

తొలి దశ ఒప్పందం ఆరు వారాల పాటు కొనసాగనుంది. ఇందులో హమాస్ బలగాలు పూర్తి స్థాయిలో కాల్పుల విరమణ పాటించాలి. గాజాలో నిర్వాసిత ప్రాంతాల నుంచి ఇజ్రాయిల్ బలగాలు వెనక్కి వెళ్లాలి. ప్రతిగా బందీలుగా ఉన్న వందల మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయాల్సి ఉంటుంది.ఇక రెండో దశ ఒప్పందంలో సైనికులు సహా ఇజ్రాయెల్ బందీలు హమాస్ విడిచిపెట్టాల్సి ఉంటుంది.