20-03-2025 02:34:59 AM
కొత్త విధానంతో పల్లె రోడ్లకు టోల్!
హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): గ్రామీణ రోడ్లకు కూడా టోల్ వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందా... అంటే బడ్జెట్ ప్రతిపాదన చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది. హైబ్రిడ్ అన్యూటీ మోడల్ (హెచ్‌ఏఎం) రోడ్లు నిర్మించి రాష్ట్రంలోని అన్ని గ్రామీణ రోడ్లను సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రంలోని 17వేల కి.మీ రోడ్లను ఈ హామ్ మోడల్‌లో అభివృద్ధి పరుస్తామని రాష్ట్రం ప్రకటించింది.
ఈ రోడ్లను 40 శాతం ప్రభుత్వ నిధులతో, 60 శాతం ప్రైవేట్ డెవలపర్ల పెట్టుబడితో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపింది. హ్యామ్ మోడల్లో 2028 వరకు గ్రామీణ ప్రాంతాలలోని 17 వేల కి.మీ రహదారులను సుమారు రూ. 28వేల కోట్లతో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
హైబ్రిడ్ అన్యూటీ మోడల్‌లో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేసినట్లయితే పక్క ఊరికి, పక్క మండలానికి, పక్క జిల్లాకు పోవాలన్నా టోల్ వసూలు చేసే పరిస్థితి ఏర్పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇదీ హామ్ విధానం...
హైబ్రిడ్ అన్యూటీ మోడల్ అనేది భారత ప్రభుత్వం రోడ్డు మౌలిక వసతుల అభివృద్ధి కోసం అవలంబించిన ప్రైవేట్- పబ్లిక్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) మోడల్. ఇది ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ) మోడల్, బిల్డ్- ఆపరేట్ -ట్రాన్స్‌ఫర్ (బీఓటీ) మోడల్‌ల మిశ్రమ రూపం. ఈ మోడల్లో నిర్మాణానికి కావాల్సిన నిధులను ప్రభుత్వం 40శాతం, ప్రైవేటు డెవలపర్ 60శాతం సమకూరుస్తారు.
ఈ విధానంలో రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్ 15 ఏళ్ల పాటు రహదారి నిర్వహణ చేపట్టాల్సి ఉంటుంది. ఈ రోడ్ల నిర్వహణకు ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు ఏటా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఈ విధానంలో టోల్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
అయితే ప్రభుత్వం మాత్రం ఈ అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మిక్స్‌డ్ మోడల్ (హామ్ ప్లస్ టోల్) విధానంలో తప్పకుండా టోల్ వసూలు చేస్తారని అధికారులు తెలిపారు.
ముమ్మాటికీ టోల్ వసూలుకే: హరీశ్‌రావు
ఈ విధానం ద్వారా ప్రజల ముక్కు పిండి వసూలు చేసేందుకు ప్రభుత్వం రెడీ అయిందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. గతంలో తాము రోడ్లు వేశామని...ఎక్కడా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వాళ్ల కమిషన్ల కోసమే రోడ్లు వేస్తుందన్నారు.