calender_icon.png 2 May, 2025 | 9:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడగండ్ల వర్షం రైతులకు తీవ్ర నష్టం

11-04-2025 12:17:54 AM

  1. ఈదురు గాలులు వడగండ్ల వాన తో రైతులు ఆందోళన 
  2. జిల్లాలో పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన వడగండ్ల వాన
  3. తీవ్రంగా నష్టపోతున్న రైతులు

కామారెడ్డి/ ఎల్లారెడ్డి, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల తో కూడిన వడగండ్ల వర్షాలు జిల్లాలో కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటీవల ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన రైతులను తీవ్ర నష్టాన్ని మిగిల్చిన పరిస్థితిని మరిచిపోక ముందే గురువారం సాయంత్రం కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పిట్లం జుక్కల్ మద్నూర్ పెద్ద కొడపుగల్ వర్ని నసురుల్లాబాద్ పోతంగల్ కోటగిరి బీర్కూర్ తదితర మండలాల పరిధిలోని గ్రామాల్లో మండల కేంద్రాల్లో కురిసిన ఈదురు గాలులతో కూడిన అకాల వడగండ్ల వాన తో రైతులు ఆందోళన చెందుతున్నారు.

రైతులు ఆరుగాలం కష్టపడి చేతికందిన పంటలను కోయడానికి సిద్ధమవుతున్న రైతులకు ఆకాల వర్షాలు ఈదురు గాలులు ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వాన రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నోటి కాడికి వచ్చిన బుక్క ఎత్తిపోతు ఉందన్న సామెత లాగా గత మూడు, నాలుగు  రోజులుగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చి పోతున్నాయి.

ఒకవైపు ఎండలు మరోవైపు ఈదురు గాలులు,ఉరుములు,మెరుపుల తో వర్షం రావడంతో జిల్లాలోని పలు మండలాల రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టుల ఆయకట్టు కింద రైతులు వరి పంటను నెల రోజులు ముందుగా వరి నాట్లు వేసి పంటలు పండించడంతో కోతలు నెల రోజుల ముందుగానే పంట చేతికి అందుతుంది.

ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో నీర్లక్ష్యం చేయడం వల్ల ముందుగా వచ్చిన పంట ను రైతులు మధ్య దళారులకు అమ్ముకున్నారు. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి,కామారెడ్డి ఎమ్మెల్యే కాటి పల్లి వెంకటరమణా రెడ్డి దృష్టికి స్థానిక రైతులు తీసుకెళ్లి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయించాలని కోరారు.

దీంతో ఎమ్మెల్యేలు ఒత్తిడి చేయడంతో ప్రభుత్వం కామారెడ్డి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలోనే మొదటి సారిగా బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి, పోతంగల్, నస్రుల్లాబాద్ బీర్కూర్, నిజాంసాగర్ ,పిట్లం, మద్నూర్ ,జుక్కల్ ,కామారెడ్డి మాచారెడ్డి, బిక్కనూర్, దోమకొండ, బి బి పేట, రామారెడ్డి, సదాశివ నగర్, గాంధారి , ఎల్లారెడ్డి ,మండల పరిధిలోని వివిధ గ్రామాల లో అధికారులు మహిళా సంఘాల ద్వారా, విండో కార్యాలయాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. మరికొన్ని కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు.

17  శాతం తేమ తేమ లోపు ఉంటేనే ధాన్యం కొనుగోలు చేస్తామని రైతులకు అధికారులు కొనుగోలు కేంద్రాల నిర్వహకులు కొర్రీలు పెడుతున్నారు. 

ఉరుములు, మెరుపులతో ఆందోళన చెందుతున్న రైతులు 

ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వస్తుండ డంతో  రైతులు కొనుగోలు కేంద్రాల వద్దకు తెచ్చిన ధాన్యాన్ని ఆరబెట్టుతూ ఉండడంతో వాతావరణంలో వస్తున్న మార్పులు రైతులను తీవ్ర ఆందోళన కు గురిచేస్తున్నాయి. గతంతో పోలిస్తే పంట పెట్టుబడులు అధికమవడంతో ప్రభుత్వం అందించే పంట పెట్టుబడి సాయం సరిపోకపోవడంతో అన్నదాతలు అప్పులు తెచ్చి వేల రూపాయలు పెట్టుబడిగా పెట్టి లాభదాయకమైన పంటలను పొందడానికి ఎదురు చూస్తున్నారు.

వరి పంట చేతికొచ్చే సమయంలో వాతావరణం లో మార్పులు సంభవించడంతో రైతన్నలు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి,తిమ్మారెడ్డి, అడవి లింగాల,రత్నాపూర్,వెళ్ళుట్ల, వెంకటాపూర్ తదితర గ్రామాల శివారు ప్రాంతాల్లో కోత దశకు వచ్చిన పంటలు చేతికందే సమయంలో వాతావరణంలో మార్పులు రావడంతో పాటు ఉరుములు మెరుపులు తో కూడిన ఈదురు గాలులు వడగళ్ల వాన రావడం తో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణం అనుకూలిస్తే నష్టం జరగకుండా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

రైతులు ఆందోళన చెందవద్దు

కోతకు వచ్చిన వరి ధాన్యాన్ని రైతులు వర్షం పడే అవకాశం ఉండడంతో కొద్ది రోజులు దాన్యం కోయకుండా ఎండలు కొట్టే ముందు వరిని కోత కోసి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలి, పచ్చిగా ఉన్న సమయంలో దాన్యాన్ని కోత కోస్తే కొను గోలు కేంద్రంలో ధాన్యాన్ని ఆరబెట్టాల్సి వస్తుంది. రైతులు తొందరపడి ధాన్యాన్ని కోత కోయించవద్దు. తేనే శాతం వచ్చేవరకు ఎదురుచూసి రైతులు కోత కోయాలి. రైతు లు ఆందోళన చెందవద్దు.

 రాజేందర్, 

మార్క్ పేడ్ డీఎం, కామారెడ్డి