calender_icon.png 19 April, 2025 | 7:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడగండ్ల బీభత్సం

11-04-2025 01:23:25 AM

  1. క్యుములోనింబస్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు
  2. పలు జిల్లాల్లో వరి, జొన్న పంటలకు నష్టం
  3. ఐకేపీ సెంటర్లలో వరదకు కొట్టుకుపోయిన ధాన్యం
  4. పిడుగుపాటుకు ఇద్దరు మృతి
  5. మరో రెండు రోజులు వర్షాలు

విజయక్రాంతి నెట్‌వర్క్, ఏప్రిల్ 10: క్యుములోనింబస్ ప్రభావంతో గురువారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. పలుచోట్ల వడగండ్లు పడటంతో పంటల కు తీవ్రనష్టం వాటిల్లింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు మండలాల్లో వరి, జొన్న పంటలకు నష్టం వాటిల్లింది. మామిడికాయలు నేలరాలాయి. సిద్దిపేట జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది.

నంగునూర్, చేర్యాల, మద్దూర్ మండలాల పరిధిలోని పలు గ్రా మాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో భారీ వడగండ్లు పడ్డాయి. కోతదశకు వచ్చిన వరి వడగండ్ల ధాటికి నేలపాలైంది. కల్లాల్లో ఆరబోసుకున్న పంట కూడా తడిసి ముద్దయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈదురు గాలులతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, జహీరా బాద్ నియోజకవర్గాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. న్యాల్‌కల్, మొగుడంపల్లి మం డలాల్లో మామిడి, జొన్న, ఉల్లి పంటలకు నష్టం కలిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువా రం తెల్లవారుజాము వరకు కురిసిన భారీవర్షంతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

జిల్లాలోని సిరిసిల్ల, కోనరావుపేట, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, రుద్రంగి, వేముల వాడ మండలాల్లో వరి పొలాలు నీట మునిగాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధా న్యం తడిసి ముద్దయింది. వరద నీటికి రోడ్ల పై ఆరబోసిన ధాన్యం గింజలు కొట్టుకుపోయాయి. 1,000 ఎకరాల్లో కోతకు వచ్చిన పంట నీట మునగగా, వంద టన్నులకు పైగా ధాన్యం తడిసింది.

సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమానుకోటలోని రెండు ఐకేపీ సెంటర్‌లో సుమారు 7,000 క్వింటాళ్ల ధాన్యం వాన నీటికి తడిసింది. వికారాబాద్ జిల్లా తాండూరులో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మూడు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

పిడుగుపాటుతో..

రాష్ట్రవ్యాప్తంగా గురువారం కురిసిన వర్షాలకు రెండు చోట్ల పిడుగులు పడి ఇద్దరు మృతిచెందారు. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం అమ్లూరుకు చెందిన మేకల కాపరి చిన్న రాములు (60) రోజువారీలా మేకలు మేపేందుకు చిన్న కొడుకు నరసింహతో కలిసి వెళ్లాడు. సాయంత్రం గాలిదుమారం ఉరుములు, మెరుపులతో వర్షం మొదలవడంతో పొలంలోని చెట్టుకింద నిలబడ్డాడు.

చెట్టుకు సమీపంలోనే పిడుగు పడటంతో రాములు అక్కడికక్కడే మృతిచెందాడు. కొద్దిదూరంలో మరో చెట్టు కింద నరసింహ నిలబడటంతో క్షేమంగా బయటపడ్డాడు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన సంతోష్ (17) అనే విద్యార్థి మృతిచెందాడు. కళాశాలకు వెళ్లి వస్తుండగా భారీ వర్షం పడటంతో చెట్టుకిందకు వెళ్లగా పిడుగు పడింది. దీంతో సంతోష్ అక్కడికక్కడే మృతి చెందాడు.