12-02-2025 12:00:00 AM
నేటి నుంచి మేడారం మినీ జాతర
కోట్లాదిగా ప్రజలను రప్పించే జనమహా జాతరకు వేళయింది. సమ్మ క్క సారలమ్మల ఆరాధ్య వేడుకగా ‘మినీ మేడారం’ నేటి నుం చి 15వ తేదీ వరకు జరగనుంది. ఈ సందర్భంగా పూజారులు అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అసలైన సమ్మక్క సారలమ్మ జాతర 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. పూజారుల సంప్రదాయం ప్రకా రం ఈ ఏడాది మండమేలిగే పండగ. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో జరిగే గిరిజనుల మహాసంబురంగా ‘సమ్మక్క జాతర’ ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది.
యావత్ తెలం గాణకే ప్రత్యేక తను తెచ్చిపెట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగగానూ గుర్తింపును పొందింది. తెలంగాణ రాష్ట్ర పండుగగానూ ఈ జాతర గుర్తింపు పొందింది. భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధిక ప్రజలు హాజరయ్యే పండుగ ఇదే. ములుగు జిల్లా కేంద్రం నుంచి సమారు 44 కి.మీ. దూరంలో తాడ్వాయి మండలంలో మారుమూల అటవీ ప్రాంతం మేడారం. దట్టమైన అడవులు, కొండకోనల మధ్య చారిత్రాత్మక జాతర అత్యంత అట్టహాసంగా జరుగుతుంది.
సమస్త గిరిజనుల సమారాధ్య దేవతలు, కష్టాలు కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపద్బాంధవులుగా తెలంగాణసహా మొత్తం దేశంలోనే వన దేవతలుగా పూజలందుకుంటున్నారు సమ్మక్క -సారక్కలు. ఇది పూర్తిగా గిరిజన సాంప్రదాయ రీతుల్లోనే జరుగుతుంది. ఏటేట హాజరయ్యే జనం పెరుగుతుండడంతో జాతరను కొండకింద జరపడం ప్రారంభించారు. అమ్మవార్ల చిహ్నంగా గద్దెలు ఉంటాయి.
వీటిపైకి జాతర రోజు అమ్మవార్ల ప్రతిరూపాలుగా ఉన్న కుంకుమ భరిణెలను తీసుకు వస్తారు. జాతరకు వచ్చే భక్తులకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. గత ఆరు నెలల ముందు నుంచే లక్షలాదిమంది భక్తులు మేడారం జాతరకి వచ్చి సమ్మ క్క తల్లులను దర్శించుకున్నారు. పిల్లలకు పుట్టువెంట్రుకలు తీశారు. ఈ నాలుగు రోజులూ జాతరకు హాజరయ్యే వారి సంఖ్య ఎప్పటి కంటే మరింత ఎక్కువ కావచ్చునని అధికారులు భావిస్తున్నారు.
కామిడి సతీష్‌రెడ్డి