హైదరాబాద్ లాంటి మహానగరంలో పేద పిల్లలతో నిండిన మురికివాడలు ఎన్నో ఉన్నాయి. నిత్యం చెత్తను ఏరుతూ సిటీని అందంగా తీర్చిదిద్దడంలో చెత్త కార్మికులే ముందుంటారు. వారిపై ‘చెత్త మనుషులు’ అని సమాజం ముద్రవేసినా మౌనంగా భరిస్తుంటారు. ఈ పరిస్థితులను తిట్టుకుంటూ బతుకు బండిని భారంగా లాగించేవారు కొందరైతే.. ఎదురించి పోరాడి విజయం సాధించేవారు సైతం ఉంటారు. అలాంటివారిలో అరిపిన జయలక్ష్మి ఒకరు. ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించడాన్ని ఉపాధిగా ఎంచుకుంది ఈ అమ్మాయి. ఒకవైపు చదువుకుంటూ, మరోవైపు బస్తీ పిల్లల బాగోగుల కోసం పనిచేస్తోంది. బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్‌గా ఒక్కరోజు విధులు నిర్వహించి అందరిచేత శభాష్ అనిపించుకుంది.
హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన జయలక్ష్మి డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రులు ఉష, రామ్మోహన్. ఇరవైయేళ్ల కిందట పొట్టచేతబట్టుకుని నగరానికి వలస వచ్చారు. చెత్తను సేకరిస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం స్వచ్ఛ ఆటో నడిపిస్తున్నారు. కూతురు జయలక్ష్మి వాళ్లకు సాయం చేస్తూనే చదువుకుంటోంది. ఉదయం నాలుగు నుంచి ఎనిమిది గంటల వరకు ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరిస్తుంది. తర్వాత కాలేజీకి వెళ్తుంది.
సాయంత్రం సమయంలో బస్తీలో 3,5-40 మంది విద్యార్థులకు ట్యూషన్స్ చెబుతుంది. అంతేకాదు.. స్వచ్చంధ సంస్థలతో కలిసి పనిచేస్తుంది కూడా. పేదరికాన్ని జయించడానికి చదువు ఒక్కటే మార్గమని బలంగా నమ్మి పనిచేసూకుంటూనే.. మరోవైపు చదువుకుంటోంది.
బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్‌గా..
వ్యర్థాలు సేకరించే జయలక్ష్మి ఇటీవల బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్‌గా నియమితులయ్యారు. ఆ హోదాలో ఒక్కరోజు విధులు నిర్వహించారు. ఆరోగ్యం, విద్య, లింగ సమానత్వంలో ఈ అమ్మాయి చేసిన కృషికిగాను సత్కరించారు. ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో చదువును కొనసాగిస్తోంది.
“ప్రజలు మమ్మల్ని ‘చెత్త మనుషులు’ అని పిలవడాన్ని అసహ్యించుకుంటాను. ఈ పనినే నమ్ముకొని బతుకుతున్నాం. ఇంటింటికీ చెత్తను సేకరించేక్రమంలో మాలాంటివాళ్లు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. చెత్తను కాల్చే సమయంలో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. చేతులకు గాజు ముక్కలు కుచ్చుకుంటాయి” అని అంటోంది జయలక్ష్మీ
సామాజిక సమస్యలపై
సామాజిక సమస్యలపై స్పందించడంలో జయలక్ష్మి ఎప్పుడూ ముందుంటుంది. గతంలో కాలనీవా సులు డ్రైనేజీతో పడుతున్న ఇబ్బందుల గురించి జలమండలి ఎండీ దృష్టికి తీసుకెళ్లింది. ఆయన స్పందిం చి కాల్వలు బాగు చేయించడంతోపాటు దోమల నివారణకు ఫాగింగ్ చేయించారు. మురుగు సమ స్య, అంగన్‌వాడీలు, రోడ్లు, విద్యుత్తు సరఫరా, తెల్లరేషను కార్డులు, ఇళ్లు.. ఇలా అనేక సమస్యలను పరిష్కరించింది. సామాజిక సమస్యలపై పోరాడటంతో హైదరాబాద్ చిల్డ్రన్ పార్లమెంట్‌కు ప్రధానమంత్రిగా ఎన్నికైంది.
సామాజిక అవగాహన, నాయకత్వ లక్షణాలు ఉన్నవారినే ఎన్నుకుంటారు. “గతంలో మా బస్తీలో చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన సంచలనం రేపింది. దీనిపై పిల్లలతో పార్లమెంట్ నిర్వహించి గట్టిగా మాట్లాడా. మద్యపానం, అమ్మకాలకు వ్యతిరేకంగా తీర్మానం చేశాం. ప్రస్తుతం సంస్థ తరఫున నెలకు రూ.2వేలు ఉపకారవేతనం ఇస్తున్నారు. వాటితోనే చదువు కొనసాగిస్తున్నా” అని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పింది జయలక్ష్మి.
ప్రజాసేవ చేయడమే లక్ష్యం
కరోనా కష్టకాలంలో ప్రజల కోసం ఎన్నో అవగాహన కార్యక్రమాలను నిర్వహించా. అవసరమైన వారికి ఆహార పదార్థాలు కూడా అందించా. ఎన్ని విజయాలు సాధించినా చెత్త సేకరించడం ఆపలేదు. విమర్శల గురించి పట్టించుకోను. కష్టపడి ఉన్నత చదువులు చదివి ఏనాటికైనా ఐఏఎస్ సాధించి.. ప్రజాసేవ చేయడమే నా లక్ష్యం.