26-04-2025 01:14:22 AM
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: పహల్గాం ఉగ్రదాడి వెనుక లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ పాత్ర ఉన్నట్టు నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అతడి ముఖ్య అనుచరుడు సైఫుల్లా పాత్ర కూడా ఉండవచ్చనేది నిఘా వర్గాల వాదన. 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఇదే అతిపెద్ద ఉగ్రదాడి. ఎప్పటి నుంచో పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తుందని ఆరోపిస్తున్న భారత్ ఈ దాడి అనంతరం ఆ దేశంపై కఠిన చర్యలు తీసుకుంది.
నిఘా వర్గాల అనుమానం ప్రకారం ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల బృందంలో ఎక్కువగా విదేశీ ఉగ్రవాదులు ఉండే అవకాశం ఉంది. వారికి స్థానికంగా ఉండే మిలిటెంట్లు కొందరు సాయం చేసినట్టు, 26/11 దాడుల మాస్టర్ మైండ్, లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్ వారికి సహకరించినట్టు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ఈ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు చాలా కాలంగా కశ్మీర్ లోయలో ఉంటున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
గతేడాది సోనామార్గ్, బూతాపత్రిలో జరిగిన దాడికి కూడా ఈ ముఠానే కారణం అని నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. 2024 అక్టోబర్‌లో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు భారత ఆర్మీ జవాన్లు సహా మొత్తం నలుగురు మృత్యువాత పడ్డారు. అదే నెలలో సోనామార్గ్ టన్నెల్‌లో జరిగిన ఓ దాడిలో ఆరుగురు కార్మికులు, ఓ డాక్టర్ మృతి చెందారు. పహల్గాం దాడిలో ప్రధాన నిందితుడిగా ఉన్న హషీం ముసా ఆనాటి దాడిలో ప్రధాన సూత్రదారుడిగా ఉన్నాడు.
2024 డిసెంబర్‌లో డచిగంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో సోనామార్గ్ దాడుల బృందంలో సభ్యుడైన జునైద్ అహ్మద్ భట్ హతమయ్యాడు. బృందంలోని ఇతర సభ్యులు దగ్గర్లోని అడవుల్లోకి పారిపోయి తప్పించుకున్నారు. భారీ ఉగ్రదాడి తర్వాత అందుకు కారణమైన ఉగ్రవాదులు అజ్ఞాతంలోకి వెళ్లిపోతారని.. పాక్‌లో ఉంటున్న వారి నిర్వాహకుల నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వీరు అజ్ఞాతంలోనే ఉంటారని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి.
పహల్గాం ఉగ్రవాదులను లష్కరే తోయిబాకు చెందిన నేతలు హఫీజ్ సయీద్, సైఫుల్లా నియంత్రించారని నిఘా వర్గాల అనుమానం. ఈ ఇద్దరు ఉగ్రవాదులు పాక్ నుంచే ఇదంతా నిర్వహిస్తున్నారని ఇంటలిజెన్స్ ఏజెన్సీలు చెబుతున్నాయి. వీరు పాక్ సైన్యం నుంచి పలు రకాల సహాయ సహకారాలు, మార్గదర్శకత్వం పొందుతున్నట్టు ఇంటలిజెన్స్ భావిస్తోంది.