calender_icon.png 20 April, 2025 | 10:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్యారా కద్దూ బారా కొత్వాల్

24-03-2025 12:00:00 AM

(‘గ్యారా’ అనగా పదకొండు. ‘కద్దూ’ అనగా సొరకాయ లేక ఆనగపుకాయ. ‘బారా కొత్వాల్’ అనగా గ్రామాలలోని పన్నిద్దరు (12) ఆయగాండ్లు. మొగలాయి జమానాలో ‘కర్ర యెవనిదో బర్రె వానిది’ అనే బాబతుగా పనులన్నీ సాగతూ వుండెను. ఒక అమాయకుడైన కాపు తుదకు లక్షాధిపతి ఎట్లైనాడో యీ కథ నిరూపించుతుంది.)

ఒకనాడు ఒక పల్లెకాపు 11 సొరకాయలను కంబట్లో వేసుకొని ఒక గ్రామానికి అమ్ముకొనే దానికి వెళ్ళినాడు. గ్రామంలో అమ్మలక్కలు పదిమంది మూగి బేరం చేస్తూ వున్నారు. అంతలో మాలీ పటేల్ వేంచేసినాడు. 

“ఒరేయ్! ఈడ కూర్చోమని నీకెవరు సెలవిచ్చినారు? మంచిమాటతో ఒక కాయ ఇచ్చిపో” అంటూ తానే ఒక పెద్ద కాయను లాగుకొని పోయినాడు. కాపువాడు గొణుక్కుంటూ ఉన్నాడు. అంతలోనే ‘గోరుచుట్టు మీద రోకటి పోటన్నట్లు’గా పోలీసు పటేలు హాజరైనాడు. 

“పట్టుకొని రారా వాన్ని ముసాఫిర్ల లెక్కలో వాని పేరు రాయాల్సింది వుంది” అని గర్జించినాడు. తలారి వచ్చి తన పాలి వక కాయ, పటేల పాలిటి వకకాయ లాగుకొని పోయినాడు. 

కొంత సేపటికి పెద్ద తలారి వచ్చినాడు. 

“ఏయ్, మొన్న నీవంటివాడే వచ్చిండెను. పొద్దు మునిగినప్పుడు కూరగాయలమ్మునట్లు అమ్మి రాత్రి కోమటోళ్ళ యింట్లో కన్నం వేసిండు. పద! చావిట్లో నిన్ను కట్టేస్తాన్‌” అంటూ తానున్నూ ఒక కాయ చేత బట్టుకున్నాడు. 

“అయ్యా! మారాజా! నేను దొంగను కాను. దొరను కాను. పొరుగూరు వాన్ని. ఎల్లప్పటికిన్ని వచ్చిపొయ్యే వాన్ని. ఇప్పటికే మూడు కాయలు ఎగిరి పోయినవి. మళ్ళీ నీవెక్కడ నుండి ఊడి పడితివి?” అని కాపువాడు మొరపెట్టుకున్నాడు. 

అదే కాయతో వాని నెత్తిని పొడిచి కాయ తో చక్కా పోయినాడు పెద్ద తలారి. ఈ విధం గా పూజారి, పురోహితుడు, కమ్మరి, వడ్ల మొదలైన 11 మంది ఆయగాండ్లు ఒకరి వెనుక వకరు వచ్చి కాయలన్నీ లాగుకొని పోయినారు. 

కాపువాడు ఏడ్చుకుంటూ గొంగడి దులుపుకొని లేస్తున్నాడు. చీకట్లోనే చేనికి పోయిన ట్టి కర్ణమయ్య అప్పుడే వానికి ప్రత్యక్షమైనాడు. 

“ఏమిరా ఏడుస్తున్నావు? నిన్నెవరేమన్నారు నాకు చెప్పు. నేనీ వూరి కర్ణాన్ని, తప్పు చేసినోనికి శిక్ష యిప్పిస్తాను” అని అన్నాడు. 

‘న్యాయం విచారించే ప్రభువు ఒక్కడైనా ఈ వూరిలో ఉన్నాడురా నారాయణా’ అని అనుకొని కాపువాడు తన 11 సొర కాయలు మాయమైన విధమంతా వినిపించి 

“అయ్యా! కరణమయ్యా, నీవే నారాయణమూర్తివి. నన్నెట్లన్నా గడ్డ కేయండి” అని గొంగడి ఆయన కాల్లమీద వేసి కాళ్ళు పట్టుకొన్నాడు. 

కర్ణం ఒక్క తన్ను ఝాడించి తన్ని కంబడి లాగి చంక బెట్టుకొని ఇట్లన్నాడు. 

“అరే లుచ్చా! అందరికీ వంతు సొరకాయ యిచ్చి నా వంతు తప్పించినావా? నేను తలారి వానికంటే పరికిరాని వాన్నా? వడ్లోని కంటే వ్యర్థుడనా? ఆ ఓనమాలు రాని మాలీ పటేలు నీకు ఎక్కువైనవాడా? తే! నా వంతు సొరకాయ. అదిచ్చి యీ గొంగడి తీసుకుపో” అని గుడ్లెర్ర చేసుకొని కంబళి తన చంక పెట్టుకొని తన యింటికి పోయినాడు.

కాపువాడు ఎగాదిగా చూచినాడు. ‘నీవూ ఇంతేనా? ఈ వూరంతా ఇంతే? ఏం దేశం యిది పాడు దేశం. ఇంక నా వంటి దిక్కులేని వారు బదికేదెట్లా?’ అని గొణుగుతూ పట్వారి వెంట కొంత దూరం దీనంగా ప్రాధేయ పడుతూ వెళ్ళినాడు. 

“ఒరేయి! ఒక్క అడుగు ముందుకు వస్తే నీ తలకాయ పగులతంతా (జాగ్రత్త) ఖబర్దార్?” అన్నాడు.

కాపువాడు దిక్కతోచకుండా నిలిచిపోయినాడు. చిన్న పిల్లవానివలె కొంతసేపు ఏడ్చి నాడు. ఒకరిద్దరు ఆడవారు వాన్ని చూచి 

“పో నాయనా! పో! పొద్దున్నే ఎవరి ముఖం చూచినావో ఏమో! యీ వూళ్ళో అందరూ ఇట్లాంటి మా రాజులే. ఇంకోమారు రావద్దు” అని బుద్ధి చెప్పినారు. 

కాపువాడు దీర్ఘాలోచన చేస్తూ ఇంటిబాట పట్టినాడు. ‘థూ. పుట్టితే పటేలు పట్వారి అయి పుట్టాలె. లేకుంటే తలారిగా అయినా పుట్టాలే. ఈ బదుకు బతికినా వకటే చచ్చినా వకటే... కాయలు పోతే పోయె కాని గొంగడికూడా పోయింది. అందరికంటే ఆ కర్ణమోడు మరీ చెడ్డవాడు. అందుకోసరమే ‘కాటికి పోయినా కర్ణం పీడ తప్ప’దన్నారు పెద్దలు... దీనికి బదలా తీయకుంటే నేను మనిషినా? అయితే, బీదోన్ని ఏమి చేయగలను? ఆ తలారికి చేరెడు చేనన్నాలేదు. నాకు చేనుంది. పెండ్లాము పైన వంకి వుంది, ఒకెద్దుంది. తలారి కంటే తక్కువనా నేను?.. దేవునికైనా దెబ్బే గురువు. నేనున్నూ ఏదో మొండి తొండి చేస్తా...’ో 

ఇట్లా ఆలోచనా పరంపరలో మునిగి నడుస్తున్నాడు. తన మోటబావిని సమీపించినాడు. బావిగడ్డపై కూర్చున్నాడు. ఇంకా దీర్ఘాలోచనలోనే ఉన్నాడు. తటాలున మెరుపు మెరిసినట్లు వాని తలలో వక ఆలోచన తళుక్కుమంటూ ప్రవేశించింది. చటుక్కు న లేచినాడు. ఊళ్ళోకి పోయినాడు. చక్కగా పెండ్లాం వద్దకు వెళ్ళి 

“ఒసేయి! నీ వంకి ఇట్లాతే. ఇయ్యమంటే! నీకేం పర్వాలేదు తే. మళ్ళీ వుగాది నాటికి ఒకటికి నూరు వంకీలు చేయిస్తే నా పేరు వెంకయ్య అనూ” అని వంకీని లాగుకున్నాడు. 

పటేలుకు దాన్ని 200 రూపాయలకు అమ్మినాడు. పైకం తీసుకొని 10 మైళ్ళ దూరంలో ఉండే పట్నం చేరుకున్నాడు. షేర్వానీలు, లాగులు, మోజాలు, పగిడీ, నడుము పట్టి, బిల్లలు మొదలైన పరికరాలు సిద్ధము చేసుకొన్నాడు. నలుగురు అరబ్బు జవానులను జత చేసుకున్నాడు. వారికి బిల్లలును తగిలించాడు. తానున్నూ బాగా వేషం వేసుకొన్నాడు. ఒక బగ్గీని కిరాయకు మాట్లాడుకొన్నారు.

రెండామడల దూరంలో ఒక పెద్ద బస్తీ ఉండింది. అది నాలుగు బాటలు కలిసే స్థలం. గొప్ప వ్యాపారి పేట. అధికారులు, మంత్రి, నవాబు కూడా ఆ మార్గంగా షికారుకు పొయ్యె స్థలం. ఆ గ్రామంలో మన కాపు దిగినాడు. ఊరబావి గట్టున ఒక పెద్ద మర్రి మానుండింది. దానికింద మేజు కుర్చీలు వేయించినాడు. జవానులను బావిపై పహిరా ఎక్కించినాడు. ప్రొద్దున్నే ఊరులోని ఆడవారు నీటికి వస్తే ఆ జవానులు 

“ఖబర్దార్! కడవకొక పైసా యిచ్చి నీళ్ళు తీసుకోండి” అని బెదరించినారు. 

పటేలు పట్వారీలు వచ్చినారు. 

“ఒరేయ్! మాకు సర్కారు హుకుం అయింది. ఇదిగో ఫర్మాన్‌” అని ఉర్దూ ముద్రలతో నుండే ఫర్మాను చూపించినాడు కాపు. ఉండవచ్చునని గ్రామాధికారులూరకైనారు.

దినమునూ పైకం బాగా వసూలు కాబట్టింది. మొదట మొదట దినం 20 రూపా యల వరకు వసూలైంది. క్రమేణ ఆదాయం ఎక్కువైంది. ‘మర్రిమాన్ పరగణా సుంకం’ చుట్టూ రెండామడ వరకు ప్రసిద్ధి అయిపోయింది. ఇట్లా వారాలు, నెలలు, సంవత్సరా లు గడిచినవి. ఒకనాడు సుబేదారు దౌరా వచ్చి గుడారాలు వేయించినాడు. అతని నౌకరు నీటికి పోతే “పైసా లావ్‌” అన్నారు జవానులు. వారు ఉత్త కడవలతో వాపసు పోయి “సర్కార్! నల్గురు అరబ్బీ జవానులు పైసా యియ్యంది నీళ్ళు తీసుకోనివ్వరు. అదే సుబేదార్ సర్కారు వారికిరా! అంటే జంబియాలతో పొడిచే దానికే పైబడ వస్తారు సర్కార్!” అని విన్నవించుకొన్నారు. 

అక్కడనే సేవలో ఉన్నట్టి పటేలు పట్వారీ లిట్లన్నారు. “హుజూర్! పదేండ్లు నుండి యీ మర్రిమాన్ పరగణా సుంకం సక్రమం గా వసూలౌతుంది. అందుకు సర్కారు ఫర్మాను వుంది” 

“ఉంటే ఉండవచ్చును” అనుకొని సుబేదారు కూడా పైసలిచ్చి నీరు తెప్పించుకొ న్నాడు.

ఒకనాడు దీవాన్ బహద్దర్‌గారు అక్కడ డేరా వేయించినాడు. అతనికిన్నీ ఇదే గతి పట్టింది. అరబ్బులు కడవకు పైసా పెట్టంది ఒక మెట్టు కూడా దిగనియ్యరు. దీవానుగారు అంతా వినుకొని ఇట్లనుకొన్నారు ‘మా హుజూర్‌గారు ఫర్మానిచ్చి నారేమో, లేకుం టే నావద్ద కూడా వసూలు చేసే గుండె వుందా వీనికి?’. దీవాను గూడా సుంకం చెల్లించుకొన్నాడు. 

ఇక కాపువాన్కి పట్టే పగ్గాలు లేవు. సుబేదారేమిటీ దీవాను బహద్దరు కూడా కిక్కురుమనకుండా సుంకం చెల్లించుకొని పోయివుంటే ‘అబ్బా ఏం దబ్దా బారా వీనిది’ అని జనులు చాటున అనుకునేవారు. 

ఇట్లా వుండంగా నవాబుగారు షికారుకు పోతూ పోతూ పొద్దుపోయిందని రాత్రికి ఆ వూరులోనే ఠికానా వేసినారు. నవాబో గివాబో ఇప్పటికి కాపువాని కెవ్వరున్నా కంటికాగేటట్లు కనబడలేదు. “పైసా ఆడపెట్టి బావిలోకి దిగూ” అన్నాడు నవాబు నౌకరును. నవాబుకు షికాయతు అయింది. నవాబు గారిట్లా తమలోనే అనుకున్నారు. ‘మా దివాన్జీ మా ఖజానా భర్తీ చేసే దానికి ఈ హుకుం ఇచ్చినాడేమో. పట్నం పోయిన తర్వాత విచారించుతాను. ఇప్పుడు మాత్రం నేనున్నూ ఖానూనుకు బద్ధున్నై ఉండాల్సిందే’ అని ఆలోచించుకొని తానున్నూ నీటినుంకం చెల్లించుకొన్నాడు.

ఈ పాటికి మర్రిమాన్ పరగణాలో రెండంతస్తుల బంగ్లా పెరిగింది. గ్రామంలో సగం భూములు కాపు వానివే. 100 ఎద్దుల సేద్యం సాగించినాడు. చుట్టూ 5 ఆమడ దూ రం అప్పులిచ్చినాడు. నవాబుగారు తమ న గరానికి వేంచేసిన తర్వాత దివానీని పిలిచి

“దివాన్సాబ్, మీరెందుకు నీటికి సుంకం ఏర్పాటు చేసినారు? ఇది అన్యాయము కాదా?” అని విచారించినాడు. 

అందుకు దీవానుగారిట్లు మనవి చేసుకొన్నారు. “బందగానే ఆలీ, హుజూర్! నేను న్నూ మీతో అలాగే గుంజారిష్ (మనవి) చేసుకోవాలె అని వుంటిని. నేను కూడా సుంకం చెల్లించుకున్నాను. హుజూర్ గారు ఫర్మానె ముబారక్ జారీ చేసి వుంటారని నేనున్నూ అనుకున్నాను.”

“అరే నీవూ హుకుం ఇయ్యలేదు. నేనూ హుకుం ఇయ్యలేదు. మరి ఈ 15 ఏండ్లనుం డి వాడు ఎట్లా వసూలు చేసినాడు? వాన్ని గిరప్తారీ (అరెస్టు) చేయించి తక్షణం పట్టి తెప్పించు” అని నవాబుగారు ఉరిమినారు.

కాపువాడు ఇట్టి ఫర్మాను కొరకై 10 ఏండ్ల నుండి నిరీక్షించుతూనే వున్నాడు. 1000 అషఫ్రీలు బంగారు తట్టలో పోసుకొని జర్రీ పనిచేసిన మఖ్మల్ బట్టపైన మూసుకొని కాపువాడు హుజూరు వానికి నజరానా సమర్పించుకొన్నాడు. నజరానా చూచేవరకు నవాబు గారు చల్లబడ్డారు. 

“క్యారే నీకీ యెవ్వర్ నీటి సుంకం హుకుం ఇచ్చినార్?” అన్నారు నవాబ్ గారు. 

“హుజూర్! ‘గ్యారా కద్దూ బారా కొత్వాల్’ హుకుం ఎట్లా ఏర్పడిందో ‘మర్రిమాన్ పరగణా సుంకం’ కూడా అట్లే ఏర్పాటైంది” అన్నాడు కాపు. “ఏమంటున్నావురా? నీవనేదేమిన్నీ అర్థం కాలేదు. సరిగా చెప్పు.”

“నా తప్పులంతా మాఫ్ చేస్తామని సెలవిస్తే అన్నీ మనవి చేసుకుంటాను.”

“సరేలే! చెప్పు చూస్తాం.”

కాపువాడు తన కథంతా వర్ణించి వర్ణించి చెప్పుకొన్నాడు. హుజూరు వారు అదే పనిగా నవ్వుతూ సాంతం విని  

“అరే! నీవు చాలా హుషారు మనిషివి. నీ తప్పంతా మాఫ్. ఇక ముందు నీవు మా దేవిడీవద్ద రాత్రి గంటలు కొట్తూ వుండుము. అదే నీకు శిక్ష” అని సెలవిచ్చినారు. 

కాపు వానికి కొన్నాళ్ళ వరకు తిక్క లేచినట్లుండింది. ఏమిన్నీ ఆదాయం లేదు. అధికారం లేదు. అడిగే వారు లేరు. రాత్రులంతా నిద్ర కాయవలెను. ఒకనాడు నిద్ర మబ్బులో రాత్రి 11 గంటలు కొట్టేది మరిచిపోయినాడు. 12 గంటలకు లేచి కొట్టినాడు. ఈ చిన్న పొరపాటుకు దేవిడీ అంతా తలక్రిందు లయ్యింది.

హుజూరు వారు 8 గంటల నుండి గంటకొక బేగం గారి గదికి పొయ్యేవారు. 11 గంటలు కొట్టలేదు. 11 గంటల బేగం వద్దకి హుజూరు పోలేదు. మర్నాడు 11 గంటల బేగం గారు గంటల కాపును పిలిపించి “అరేయ్! నా గంట మరిచిపోకుండా కొడ్తూ వుండుము, నెలకు 50 రూపాయిలిస్తాను” అని అన్నది. “చిత్తం చిత్తం హుజూర్!” అని కాపువాడు తత్తరపాటుతో అన్నాడు. ‘ఈ గంటలలో ఏమో రహస్యం ఉందిరా’ అని కాపువానికి స్ఫురించింది.

 ఒకనాడు 9 తప్పించినాడు. ఒకనాడు 10 తప్పించినాడు. ఒకనాడు 12 తప్పించినాడు. ఏ గంట తప్పితే మరునాడే ఆ బేగం గారు కాపువానికి జీతం ఏర్పాటు చేసుకొన్నది. ఈ విధంగా నెలకు 400 రూపాయల జీతం ఏర్పా టైంది కాపువానికి. కొన్ని యేండ్ల తర్వాత నవాబుగారికీ సంగతి కూడా తెలిసింది. ‘వీడు చలాకీవాడు’ అని మెచ్చుకొని వాడు సుంకం వసూలు చేసిన గ్రామమే వానికినాముగా ఇచ్చి పంపి వేసినాడు. చూచినారా సొరకాయ మహిమ! సొరకాయ నరుకుట అంటే ఇట్లాంటి కథలు చెప్పే దానికే అంటారు.

ప్రచురణ కాలం: 1931

‘మొగలాయి కథలు’ నుంచి..

‘కథా నిలయం’ సౌజన్యంతో..