calender_icon.png 19 January, 2025 | 8:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుర్రాళ్లు.. కుమ్మేయండి!

06-07-2024 12:05:00 AM

సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రెండో టీ20 ప్రపంచకప్ గెలిచి సగర్వంగా భారత గడ్డపై అడుగుపెట్టిన టీమిండియాకు అపూర్వ స్వాగతం దక్కింది. అశేష అభిమానుల సమక్షంలో వాంఖడే స్టేడియంలో సంబురాలు అంబరాన్ని అంటాయి. ఆ సంబురాల నుంచి అభిమానులు తేరుకోక ముందే యంగ్ ఇండియా జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో యువ జట్టు సిరీస్‌ను కొల్లగొట్టి భవిష్యత్తు జట్టుకు బాటలు వేయాలని ఆశిద్దాం. రోహిత్, కోహ్లీ, జడేజా లాంటి దిగ్గజాలు పొట్టిఫార్మాట్‌కు వీడ్కోలు పలకడంతో వారి స్థానాలను భర్తీ చేసేది ఎవరన్నది 

ఆసక్తికరంగా మారింది!

హరారే: పొట్టి ప్రపంచకప్ ఇలా ముగిసిందో లేదో టీమిండియా మరో టీ20 సిరీస్‌కు సన్నద్ధమైంది. సీనియర్ల గైర్హాజరీలో గిల్ సారథ్యంలోని యువ జట్టు జింబాబ్వేతో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో నేడు హరారే వేదికగా భారత్, జింబాబ్వేల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. పాండ్యా, సూర్యకుమార్, పంత్, అక్షర్, కుల్దీప్‌లకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇవ్వడంతో కుర్రాళ్లకు ఇది మంచి అవకాశం కానుంది. ఇటీవలే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ సీజన్)లో మంచి ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లు జట్టులో చోటు దక్కించుకున్నారు. ముఖ్యంగా అందరి కళ్లు అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్‌లపై ఉన్నాయి. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన ఈ ఇద్దరు టీమిండియా తరఫున రాణించాలని ఉవ్విళ్లూరుతున్నారు.

బ్యాటింగ్ విభాగంలో గిల్, రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, ధ్రువ్ జురేల్‌లతో మన జట్టు పటిష్టంగానే కనిపిస్తోంది. బౌలింగ్‌లో ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్, హర్షిత్ రాణా, రవి బిష్ణోయి, వాషింగ్టన్ సుందర్‌లు కీలకమయ్యే అవకాశముంది. ఈ సిరీస్‌కు ఎంపికైన సంజూ శాంసన్, శివమ్ దూబే, యశస్వి జైస్వాల్‌లు మూడో టీ20 నుంచి జట్టుకు అందుబాటులోకి రానున్నారు. మరోవైపు జింబాబ్వే కెప్టెన్‌గా ఎంపికైన సికందర్ రజా జట్టును విజయపథంలో నడిపించాలని భావిస్తున్నాడు. భారత జట్టులో సీనియర్లు లేకపోవడంతో మ్యాచ్‌లో ఆధిపత్యం ప్రదర్శించాలని జింబాబ్వే భావిస్తోంది.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బాటలోనే ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నా. దిగ్గజాల స్థానాలను భర్తీ చేయడం కష్టం. మావంతు కృషి చేసేందుకు ప్రయత్నిస్తాం. జింబాబ్వేతో పోరులో నేను అభిషేక్ కలిసి ఓపెనింగ్ చేయనున్నాం. రుతురాజ్ గైక్వాడ్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. ఐపీఎల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం ఇప్పుడు పనికివస్తుంది.

-భారత కెప్టెన్