calender_icon.png 28 October, 2024 | 1:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాన్‌మసాలా పేరిట గుట్కా దందా

14-07-2024 05:59:55 AM

  • ప్రధాన పట్టణాలే కేంద్రంగా వ్యాపారం 
  • పోలీసులకు అనుమానం రాకుండా జాగ్రత్తలు 

వికారాబాద్, జూలై13 (విజయక్రాంతి): పాన్ మసాలా పేరిట జిల్లాలో నిషేధిత గుట్కాదందా జోరుగా సాగుతోంది. ప్రధాన పట్టణాలైన వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ కేంద్రాలుగా గ్రామాలకు సరఫరా చేస్తూ గుట్కా వ్యాపారం సాగిస్తున్నారు. పాన్ మసాలా పేరిట తప్పుదోవ పట్టిస్తూ గుట్కా ఉత్పత్తులను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. కొన్నేళ్లుగా ఈ దందా కొనసాగుతున్నా పోలీసులు నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. గత గురువారం ఒక్కరోజే రూ.7.50 లక్షల విలువైన గుట్కా పట్టుబడింది. దీనిబట్టి జిల్లాలో దందా ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. 

ఇష్టారీతిన గుట్కా విక్రయాలు

గుట్కాపై నిషేధం ఉన్న నేపథ్యంలో వ్యాపారులు కొత్త ఎత్తుగడతో దందా నిర్వహిస్తున్నారు. పాన్ మసాలాపై నిషేధం లేదంటూ ఇష్టారీతిన గుట్కా విక్రయాలు చేపడుతున్నారు. జిల్లాలోని కోట్‌పల్లి మండలం ఒగులాపూర్‌లో గుట్కా వ్యాపారి ఎవరికి అనుమానం రాకుండా కోళ్ల ఫారాన్ని గుట్కా దందాకు అడ్డగా మార్చుకున్నాడు. దానా సంచుల గోదాంలో గుట్కా సంచులను భద్రపర్చి, చుట్టుపక్కల గ్రామాలకు పెద్ద ఎత్తున గుట్కా సరఫరా చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు దాడులు చేసి రూ.8లక్షల విలువ చేసే 50 క్వింటాళ్ల గుట్కా సంచులు స్వాధీనం చేసుకున్నారు. 

తాండూరు గోదాముల నుంచి ఇతర పట్టణాలకు 

తాండూరు కేంద్రంగా జిల్లాలో గుట్కా వ్యాపారం సాగుతున్నది. ఇక్కడి గోదాముల నుంచే ఇతర పట్టణాలకు, గ్రామాలకు సరఫరా అవుతున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితం తాండూరు పట్టణంలో దాడులు నిర్వహించగా, ఒకేరోజు రెండు గోదాముల్లో గుట్కా పట్టుబడింది. ఒక గోదాంలో రూ. 5.50 లక్షల గుట్కా, మరో గోదాంలో రూ.1.50 లక్షల విలువ చేసే గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారులు గోదాంల నుంచి ద్విచక్ర వాహనా లపై ఇతర గ్రామాలకు పంపిస్తున్నట్లు తేలింది. తాండూరు పట్టణానికి కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులు ఉండడంతో ఆ రాష్ట్రాల నుంచి గుట్కా దిగుమతి పెద్ద ఎత్తున అవుతున్నట్లు సమాచారం.