calender_icon.png 26 October, 2024 | 4:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘గుస్సాడీ గుండె’ ఆగింది!

26-10-2024 02:02:28 AM

  1. అనారోగ్య సమస్యలతో కనకరాజు కన్నుమూత
  2. ఆయన సేవలకు గుర్తింపుగా 2021లో ‘పద్మశ్రీ’ పురస్కారం
  3. నేడు స్వగ్రామం మార్లవాయిలో అంత్యక్రియలు

కుమ్రంభీం ఆసిఫాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): పూర్వీకుల నుంచి గుస్సాడీ నృత్య వారసత్వా న్ని అందుకుని, ఆ సంప్రదాయాన్ని భవిష్యత్తు తరాలూ కొనసాగించాలనే తపనతో తన శక్తియుక్తులన్నింటినీ వెచ్చించి, నృత్యంలో కొత్త రీతులకు శ్రీకారం చుట్టి, భారత ప్రభుత్వ పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుని తన జీవితాన్ని సాఫల్యం చేసుకున్న గుస్సాడీ కనకరాజు (80) శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

కనకరాజు స్వగ్రామం ఇప్పటి ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం మార్లవాయి. చిన్నప్పటి నుంచే గుస్సాడీ నృత్యంపై ఆసక్తి పెంచుకున్న కనకరాజు ఆ నృత్యానికి కొత్త సొబగులు అద్దాడు. గుస్సాడీ నృత్యానికే వన్నె తెచ్చాడు. వేలాది మంది ఆదివాసీ యువకులకు నృత్య రీతులు నేర్పించాడు. ప్రతిఫలంగా ఆయన ఒక్క రూపాయి కూడా ఆశించలేదు.

ఇందిరా గాంధీ హయాంలో కనకరాజుకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. నాడు కనకరాజు, బృందం ఏకంగా ఢిల్లీలోని ఎర్రకోటలో నృత్య ప్రదర్శన ఇచ్చి ఆహూతులను అబ్బురపరిచారు. ఆ ప్రదర్శన తర్వాత ఇక కనకరాజు బృందం వెనక్కి తిరిగి చూసుకోలేదు. దేశవ్యాప్తంగా వేలాది ప్రదర్శనలిచ్చారు.

కనకరాజు సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2021లో పద్మశ్రీ ప్రకటించింది. కనకరాజు ఇదే ఏడాది నవంబర్ 9న నాటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. కనకరాజుకు ఇద్దరు భార్యలు భీంబాయి, పార్వతి. వీరికి 12 మంది సంతానం. ముగ్గురు కొడుకులు, తొమ్మిది మంది కుమార్తెలు.

కుటుంబ సభ్యులు శనివారం మార్లవాయిలో ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం కనకరాజుకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కనకరాజు మృతిపై రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క, ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్, ఎమ్మెల్యే కోవలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ ఎంపీ సోయం బాబురావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

అసామాన్యుడు గుస్సాడీ

గుస్సాడీ నృత్య కళాకారుడు, పద్మశ్రీ  గుస్సాడీ కనకరాజు మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుస్సాడీ నృత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయటంతో పాటు తెలంగాణ కళలను, సంస్కృతి సంప్రదాయాలను కాపాడిన కనకరాజు అసామాన్యుడని, ఆయన మరణం తీరని లోటని రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. 

గుస్సాడీ నృత్య ప్రదర్శనలతో పాటు ఇతరులకు నేర్పించటంలోనూ కనకరాజు తన విశేష సేవలు అందించారని గుర్తు చేసుకున్నారు. అంతరించిపోతున్న ఆదివాసీల కళను దేశ వ్యాప్తంగా అందరికీ పరిచయం చేసిన అరుదైన కళాకారుడు కనకరాజు మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.  కనకరాజు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.