calender_icon.png 30 September, 2024 | 6:57 PM

అద్దె చెల్లించలేదని.. గురుకుల భవనానికి తాళం

30-09-2024 04:47:37 PM

అలంపూర్: గద్వాల జిల్లా ఎర్రవల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ గురుకుల పాఠశాల నిర్వాహణ కోసం ఇచ్చిన భవనానికి సంబంధించి అద్దె బకాయిలు చెల్లించలేదని భవన యజమాని సోమవారం ప్రధాన గేటుకు తాళం వేశారు. ఉపాధ్యాయులను లోపలికి అనుమతించలేదు. గురుకుల పాఠశాలకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గతంలో అయిజ మండలానికి సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల మంజూరయ్యింది. అయితే అక్కడ విద్యార్థులకు సరైన వసతులు, సౌకర్యాలు లేని కారణంగా అట్టి గురుకుల పాఠశాలను తాత్కాలికంగా కొంత సమయం వరకు ఎర్రవల్లి మండల కేంద్రానికి తరలించారు. ఎర్రవల్లిలో ఒక భవనాన్ని రెంట్ కి తీసుకుని పాఠశాలను నిర్వహిస్తున్నారు.అయితే తొమ్మిది నెలలగా బిల్డింగ్ కు అద్దె బకాయి ఉండడంతో యజమాని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ లో విద్యార్థులు ఉండగా ప్రధాన గేటుకి తాళం వేశారు. బకాయి చెల్లించకుంటే గేట్లు తీసేదే లేదని చెప్పాడు. యజమానితో సంబంధిత అధికారులు మాట్లాడారు. బిల్లులు త్వరగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు.