20-04-2025 12:13:14 AM
అడ్వాన్స్‌డ్‌కు అర్హత పొందిన 525 మంది ఎస్సీ గురుకుల విద్యార్థులు
బీసీ గురుకులాల్లో 63 మంది అర్హత
విద్యార్థులను అభినందించిన సీఎం
హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): కార్పొరేట్ సంస్థల విద్యార్థుల కంటే తామేమీ తక్కువ కాదని తెలంగాణ సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ విద్యార్థులు నిరూపించారు. జేఈఈ మెయిన్స్ 2025 ఫలితాల్లో సాంఘిక సంక్షే మ గురుకులాలకు చెందిన 525 మంది విద్యార్థులు 61 పర్సెంటైల్ కంటే అధికంగా మార్కులు సాధించి జెఈఈ మెయిన్‌లో అర్హత సాధించారు. ఈ ఫలితాలు గురుకుల సంస్థ చరిత్రలోనే మొట్టమొదటి సారిగా సాధించడం ఒక సువర్ణ అధ్యాయమని గురుకులాల కార్యదర్శి డా . వర్షిణి తెలిపారు. ప్రైవేటు కోచింగ్ సంస్థలకు ధీటు గా తమ విద్యార్థులకు జేఈఈ శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు.
90ఆపై పర్సెంటైల్ సాధించిన విద్యార్థులు 40 మంది కాగా, 80ఆపై పర్సెంటైల్ సాధించిన విద్యార్థులు 164 మంది ఉన్నా రు. గౌలిదొడ్డి బాలుర కళాశాలకు చెందిన మణిదీప్ 99 .03 పర్సెంటైల్, చరణ్ తేజ్ 98.30, రామ్ చరణ్ తేజ 98 .08, బాలికల కళాశాల విద్యార్థినీలు తేజస్విని 98 .27, కీర్తన 96 .71 సాధించగా, షేక్ పేట గురుకులకు చెందిన అఫ్రయాం 97.87, నల్గొండ జిల్లా జివి గూడెం కళాశాలకు చెందిన కీర్తన 96 .71 పర్సెంటైల్‌లను సాధించారు. పేదరికం అడ్డుగోడ కాదని ఆత్మవిశ్వాసంతో గురుకుల విద్యార్థులు నిరూపించారు. విజయాలు సాధించిన విద్యార్ధులను, వారి తల్లిదండ్రులను, అందుకు కృషి చేసిన సిబ్బందిని సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క, ఎస్సీడీడీ ప్రిన్సిపాల్ సెక్రటరీ శ్రీధర్, గురుకులాల కార్యదర్శి డాక్టర్ వర్షిణి ప్రత్యేకంగా అభినందించారు.
బీసీ గురుకుల విద్యార్థుల హవా...
బీసీ గురుకుల విద్యార్థులూ జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తా చాటారు. జాతీయ స్థాయిలో ఐఐటి, ఎన్‌ఐటిల్లో 2025 సంవత్సరంలో ప్రవేశం కోసం నిర్వహించిన జెఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షలో బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో అర్హత సాధించారు. 90కి పైగా పర్సంటైల్ 9 మంది విద్యార్థులు సాధించగా మొత్తం 63 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు.
నవదీప్( 97.43 పర్సెంటైల్), రాజశేఖర్ రెడ్డి (94.10), తరుణ్(93.02), వరుణ్ (91.68), శ్రీకాంత్(91.68), ఆశిష్(91.12), సాయి ప్రసన్న(90.46), జాహ్నవి(92.08) స్వాతి (91.82) ఉన్నారు. 32 మంది అబ్బాయిలు, 31 మంది అమ్మాయిలు ఉన్నారు. 80 కంటే ఎక్కువ పర్సంటైల్ సాధించిన వాళ్లలో 23 మంది అబ్బాయిలు, 18 మంది అమ్మాయి లు ఉన్నారు. అధిక పర్సంటైల్ సాధించిన, క్వాలిఫై అయిన విద్యార్థులను సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంజెపి కార్యదర్శి బడుగు సైదులు అభినందించారు.