సూర్యాపేట, జనవరి 20: గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్యహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగింది. సూర్యాపేటలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికా విద్యాలయంలో చివ్వెంల మండలం బీబీగూడెం గ్రామానికి చెందిన వల్లపు హర్షిత తొమ్మిదో తరగతి చదువుతున్నది.
సంక్రాంతి సెలవుల అనంతరం అదే కళాశాలలో చదువుతున్న తన అక్కతో కలిపి ఇద్దరిని తల్లిదండ్రులు సోమవారం ఉదయం పాఠశాలకు తీసుకెళ్లారు. తన సామగ్రిని హర్షిత గదిలో పెట్టి, నేరుగా డార్మెటరీలోకి వెళ్లి చున్నీతో ఉరేసుకుంది. గమనించిన తోటి విద్యార్థులు సిబ్బందికి సమాచారం అందించడంతో వెంటనే ఉరిని తప్పించి సూర్యాపేటలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు చెప్పినట్టుగా తెలుస్తున్నది. కాగా సూర్యాపేట పట్టణ సీఐ వీరరాఘవులు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు. కాగా విద్యార్థిని ఆత్యహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.