calender_icon.png 2 November, 2024 | 9:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురువు గొప్పతనం

19-07-2024 12:00:00 AM

వేదార్థం మధుసూదన శర్మ :

21న గురుపౌర్ణమి

‘మాతృ దేవోభవ, పితృ దేవోభవ ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ’ అని వేదం ప్రబోధిస్తున్నది. భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల తరువాత గురువుకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ‘గురుపౌర్ణమి’ రోజున వారిని విధిగా పూజించాలి, ఆరాధించాలి. 

గురుఃబ్రహ్మః గురుఃవిష్ణుః గురుదేవో మహేశ్వరః 

గురు సాక్షాత్పరబ్రహ్మః  తస్మై శ్రీగురవేనమః 

త్రిమూర్తి స్వరూపుడు గురువు. 

‘గు’ శబ్ద స్యంధ కారస్యాత్. ‘రు’ శబ్ద తన్నిరోధకః 

అంధకార నిరోధిత్వాత్ గురు రిత్యభి ధీ మతే 

‘గు’ శబ్దం అంధకారాన్ని సూచిస్తుంది. ‘రు’ శబ్దం దాన్ని నిరోధిస్తుంది. అజ్ఞానం అనే చీకటిని తొలగించి, విజ్ఞానం అనే వెలుగులోకి మనల్ని నడిపించే వాడు గురువు. 

‘తండ్రికంటే తల్లి వందరెట్లు గౌరవానికి అర్హురాలు. తల్లికంటే కూడా నూరింతలు పూజింపదగిన వాడు గురువు-’ అంటున్నది ‘దేవి భాగవతం’. ధ్యానానికి, మంత్ర జపానికి, ఉపాసనకు, శాస్త్రాధ్యయనానికి గురువు తప్పనిసరి. అతి సామాన్యులైనా, అవతార పురుషులైనా ప్రతి ఒక్కరూ సద్గురువును ఆశ్రయించాల్సిందే. శ్రీరామచంద్రుడు వశిష్టుడివద్ద, శ్రీకృష్ణు డు సాందీపుడి దగ్గర, పాండవులు ద్రోణుడివద్ద విద్యాభ్యాసం చేశారు. ‘ఎన్న గురునికన్నా ఎక్కువ లేదయ్యా, గురువు లేక విద్య గురుతుగా దొరకదు, గురుని శిక్ష లేక గురుతెట్లు కలుగునో, అజునికైనా వాని యబ్బకైనా’ అంటూ గురువు ప్రాధాన్యాన్ని వివరించారు వివిధ శతక కర్తలు. గురుత్వం జడ పదార్థం కాదు. అది చైతన్య స్వరూపం. అదొక ఉనికి. అది ఏ వ్యక్తిలో అయితే సంపూర్ణంగా నిక్షిప్తమై ఉంటుందో ఆయనే గురు స్వరూపం. వారే గురువు. వారు స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. సనాతన కాలం నుండి ఎందరో మహనీయులు ప్రవచనాలు, బోధనల ద్వారా, రచనల ద్వారా ఎన్నో గొప్పగొప్ప విషయాలు సమాజానికి అందించారు. వారి అనుభవాలే సంప్రదాయాలు, ఆచారాల రూపంలోకి వచ్చాయి.

గురువులు నదీ ప్రవాహం లాంటివారు. నది తన దారిలో ఎన్నో కొండలను, మైదానాలను, తీర్థాలను, క్షేత్రాలను, తాకుతూ ముందుకు వెళుతుంది. వాటిని అది గుర్తించదు. ఆ నది ఒడ్డున ఉండడం వల్ల అవి ప్రసిద్ధమవుతాయి. అలాగే, గురువు ఎందరికో జ్ఞానభిక్ష పెడుతూ ముందుకు సాగుతాడు. గురువులను బట్టి శిష్యులకు పేరు వస్తుంది కానీ, శిష్యులనుబట్టి గురువుకు కాదు. గురువులు ప్రధానంగా రెండు రకాలు. విద్యను అందించి, ఈ భౌతిక ప్రపంచంలో జీవించడానికి దారి చూపేవారు. మోక్ష విద్యను బోధించి, మనకు పునర్జన్మ లేకుండా చూసేవారు. ఈ రెండోరకం వారిని ‘ఋషి’ అంటాం. అందుకే, పితృ, దైవ ఋణాలుసహా ఋషిఋణమూ తీర్చుకోవాలని శాస్త్రం అంటున్నది.

 గురువు అనంత శక్తిమంతుడు. తాను రాజు కాలేక పోవచ్చు కానీ, రాజును తయారు చేయగలడు. ఆదిశంకరులు నాలుగు పీఠాల ద్వారా ఈనాటికీ భారత ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఒక సాధారణ పూజారి అయిన రామకృష్ణ పరమహంస వివేకానందునిలో అనంత శక్తిని నింపి ప్రపంచాన్నే జయింపజేశారు. శ్రీ విరజానంద సరస్వతి దయానందుని వంటి వేదమూర్తిని సృష్టించాడు. భారతీయ సాంస్కృతిక వైభవ పునరుద్ధరణకు సమర్థ రామదాసు ఈ గడ్డపై శివాజీని నడిపించాడు. ఇలా ఎందరో గొప్ప గురువులు జాతిని ఆధ్యాత్మికంగా, భౌతికంగా ఉన్నత స్థాయిలో నిలబెట్టేందుకు కృషి చేశారు. అందుకే వారు దైవ సమానులు. 

‘వ్యాస’ జన్మదినమే గురు ఆరాధన

మనం ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ పూర్ణిమ రోజును వ్యాస పౌర్ణమిగా లేదా గురు పౌర్ణమిగా జరుపుకుం టాం. ఆరోజు ఎంతో పవిత్రమైంది. విశిష్టమైంది. ఎం దుకంటే వేదాలను, పంచమ వేదమైన మహాభారతా న్ని, అష్టాదశ పురాణాలను, వింగడించి, మనకు అం దించిన ఆర్ష వాఙ్మయానికి మూలపురుషుడు వ్యాసు డు. ఆయన ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున జన్మించాడు. వ్యాసుడు జగద్గురువు కాబట్టి, తాను పుట్టిన రోజును ‘గురు పౌర్ణమి’గా జరుపుకుంటున్నాం. 

ద్వాపర యుగంలో పరాశర సత్యవంతులకు జన్మించిన పుత్రుడు వ్యాసుడు. అసలు పేరు కృష్ణ ద్వైపా యన. తన కాలంలో ఉన్న వేదరాశిని సేకరించి, నాలుగు భాగాలుగా విభజించి, యజ్ఞ యాగాది క్రతువులలో ఉపయోగపడే విధంగా తన నలుగురు ప్రధాన శిష్యులైన పైల, వైశంపాయన, జైమిని, సుమంతులకు బోధించడం ద్వారా వేద వాఙ్మయ పరిరక్షణకు గొప్పసేవ చేశాడు. అందుకే, తాను ‘వ్యాస’ అనే గౌరవ నామాన్ని పొందాడు. ‘వ్యాస’ అంటే ‘విభజించుట’ అని అర్థం. అలాగే, అష్టాదశ పురాణాలను, బ్రహ్మ సూత్రాలను, భారత భాగవత గ్రంథాలను జాతికి అందించారు. ఆయన జన్మదినాన్నే ‘గురు పౌర్ణమి’గా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తున్నది. 

వ్యాస వాల్మీకులు ప్రాతఃస్మరణీయులు. ఇతిహాస ప్రదాతలు. వీరేగాక సూతుడు, నారదుడు, సనత్కుమారుడు, శుకుడు వంటి పురాణ పురుషులతోపాటు శంకర భగవత్పాదులు, శ్రీమద్రామానుజులు మొదలైన మతాచార్యులు అందరూ కూడా గురుదేవులే. 

వ్యాసం వశిష్ట నప్తారం శక్తే: 

పౌత్ర మ కల్మషం 

పరాశరాత్మజం వందే 

శుకతాతం తపోనిధిం ॥

‘వశిష్టుని మనిమనవడు, శక్తి మనవడు, పరాశరుని కుమారుడు, శుకుని తండ్రి, తపోనిధి అయిన వ్యాసునికి నమస్కారం--’ అని పై శ్లోక భావం. ఇందులో వ్యాసుని వంశ పరంపర ఉంది. వ్యాసుని కుమారుడైన శుకుని కూడా స్మరించుకొంటున్నాం. వ్యాసుడిని విష్ణు స్వరూపంగా భావిస్తాం. ‘వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే! నమోవై బ్రహ్మణిదయే వాసిష్టాయ నమోనమః’ అని వ్యాసునికి నమస్కారం చేస్తాం. ఆయన అందించిన జ్ఞాన సంపద అమోఘమైంది. కనుకే, వారు గురువులకే గురువయ్యారు. 

జ్ఞానానందమయం దేవం

నిర్మల స్ఫటికాకృతం 

ఆధారం సర్వ విద్యానాం 

హయగ్రీవ ముపాస్మహే ॥

అని హయగ్రీవ స్వామిని, 

గురువే సర్వలోకానాం 

భిషజే భవరోగినాం 

నిధయే సర్వ విద్యానాం 

దక్షిణామూర్తయే నమః ॥ 

అని ‘సర్వవిద్యలను అందించేవాడు, సర్వరోగాలను నశింపచేసేవాడు, సర్వలోకాలలో వ్యాపించిన వాడు గురువు’ అంటూ దక్షిణామూర్తిని గురుపూర్ణిమ రోజున ప్రార్థిస్తాం. 

విద్యా ధనం బలం చైవ 

తేషాం భాగ్యం నిరర్థకమ్ 

యేషాం గురు కృపా నాస్తి 

అధోగచ్చంతి పార్వతీ ॥

అంటే, ‘గురుకృప లేని వారికి చదువు, ధనం, బలం, భాగ్యం అన్నీ ఉన్నా నిరర్థకమే-’ అన్నాడు శివుడు పార్వతీదేవితో. అందుకే, ప్రతి ఒక్కరికీ గురువు అవసరం. జ్ఞాన సముపార్జనకు మార్గదర్శనం చేసే సద్గురువును వెతికి సంపాదించుకోవాలి. అది నిరంతర అన్వేషణగా ఉండాలి. సద్గురువు అనుగ్రహంతోనే మనకు ఉజ్వల భవిష్యత్తు సంప్రాప్తి స్తుంది. మానవ రూపం ధరించి, దైవ సమానులైన గురువులను ‘గురు పౌర్ణమి’ సందర్భంగా పూజించి, సత్కరించి, వారి అనుగ్రహాన్ని పొందడం శ్రేయస్కరం. రాబోయే తరాల వారికి ఈ వారసత్వ సంప దను అందించటం మనందరి బాధ్యత కూడా.

వ్యాసకర్త సెల్: 9063887585