12-03-2025 05:23:07 PM
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): శ్రీశైలం ఎడమ గట్టు సొరంగంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని అధికారులు పంజాబ్ రాష్ట్రంలోని సొంత గ్రామానికి చేర్చి భార్య రజ్వీందర్ కౌర్‌కు బుధవారం అప్పగించినట్లు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పేర్కొన్నారు. రాబిన్స్ ఇండియా కంపెనీలో ఎరెక్టర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న గురుప్రీత్ సింగ్ గత నెల 22న సురంగంలో పనిచేస్తుండగా ప్రమాదంలో చిక్కుకొని మృతి చెందాడు. ఈనెల 9న సొరంగంలో నుంచి బయటకు తీసి పోస్టుమార్టం అనంతరం ప్రత్యేక అంబులెన్స్ ద్వారా పంజాబ్ రాష్ట్రానికి తరలించగా మూడు రోజుల ప్రయాణం అనంతరం బుధవారం పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ డివిజన్ చీమకలం ప్రాంతంలోని తన స్వగృహానికి అధికారులు మృతదేహాన్ని తరలించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గురుప్రీత్ సింగ్ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ₹25 లక్షలు ఎక్స్ గ్రేషియాను అందజేసినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.