కిష్తార్‌లో గ్రామరక్షణ గార్డులను చంపిన
24గంటల్లో ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం
జమ్ముకశ్మీర్, నవంబర్ 8: జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో శుక్రవారం ఉదయం భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. నిఘా సమాచారం మేరకు సోపోర్‌లోని సాగిపోరా ప్రాంతంలో గురువారం సాయంత్రం జమ్ముకశ్మీర్ పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా చేపట్టిన సెర్చ్ ఆపరేషన్‌లో ఉగ్రవాదులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన ఉగ్రవాదులను కిష్తార్ జిల్లాలో గ్రామ రక్షణ గార్డులను హతమార్చినవారిగా పోలీసులు అనుమానిస్తున్నారు.
జమ్ముకశ్మీర్‌లోని కిష్తార్ జిల్లాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. గురువారం సాయంత్రం ఇద్దరు గ్రామ రక్షణ గార్డులను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు ఆ తర్వాత వారిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ‘కశ్మీర్ టైగర్స్’ అనే సంస్థ ఈ దాడికి బాధ్యత వహించింది. బాధితులను చంపే ముందు వారి కళ్లకు గంతలు కట్టిన చిత్రాలను కూడా ఉగ్రవాదులు పంచుకున్నారు.