30-03-2025 12:13:28 AM
రెండు దుకాణాల యజమానుల గొడవ..
గాల్లోకి రెండు రౌండ్లు కాల్చిన మూడో వ్యక్తి
కింగ్స్ ప్యాలెస్ ఎక్స్‌పోలో ఘటన
కార్వాన్, మార్చి 29: గుడిమల్కాపూర్ శనివారం తుఫాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. గుడిమల్కాపూర్‌లోని కింగ్స్ ప్యాలెస్‌లో జరిగిన ఈ ఘటనతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కింగ్స్ ప్యాలెస్‌లో సానియామిర్జా సోదరి ఆనం మిర్జా గత నెలరోజులుగా ఎక్స్‌పో నిర్వహిస్తున్నారు.
శనివారం ఉదయం 7:30 గంటల సమ యంలో ఫర్ఫ్యూమ్‌లు విక్రయించే షాపు యజమాని మోహిష్ అహ్మద్ ఇంతియాజ్, టాయ్స్ దుకాణాదారుడు సయ్యద్ ఆమన్ మధ్య గొడవ జరిగింది. గొడవ పెద్దది కావడంతో నిర్వాహకులు మీర్ హసిబుద్దీన్ అలియాస్ హైదర్ వారిని సముదాయించాడు. వారిద్దరు ఎంతకూ వినకపోవ డంతో హసిబుద్దీన్ తన జేబులో ఉన్న తుపాకీ బయటకు తీసి గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు.
దీంతో స్థానికులు, అక్కడ ఉన్న వారు ఒక్కసారిగా ఉలిక్కిపడి బయటకు పరుగులు తీశారు. గుడిమల్కాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. హైదర్ నుంచి తుపాకీ స్వాధీనం చేసుకుని, అతడిని అదుపులోకి తీసుకున్నారు. హైదర్ రంగారెడ్డి జిల్లా పరిగి మండలంలోని ఓ గ్రామానికి చెందని మాజీ సర్పంచ్.
మాసబ్ ట్యాంక్ ఏసీగార్డ్స్‌లోని పారామౌంట్ గార్డెన్‌లో ఉంటున్నాడు. 2021లో నాంపల్లి పోలీస్‌స్టేష న్ పరిధిలో 0.32 ఎంఎం పిస్టోల్ లైసెన్స్ తీసుకున్నాడు. అతడి వద్ద 17 రౌండ్ల బుల్లెట్లు కలిగి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అందులో నుంచి 2 రౌండ్లు కాల్చడంతో మిగతా 15 బుల్లెట్లను తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.