24-03-2025 11:27:43 PM
పోలీసుల అదుపులో ఇద్దరు వ్యక్తులు...
జగిత్యాల అర్బన్ (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా రాయికల్లో ఇద్దరు అజ్ఞాత వ్యక్తుల దగ్గర తపంచ లభ్యం అవ్వడం కలకలం రేపింది. మండలంలోని రామోజీపేట గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను గ్రామస్తులు గమనించారు. సదరు వ్యక్తుల కదలికలపై అనుమానం రావడంతో వారిని తనిఖీ చేయగా నాటు తపంచాతో పాటు బుల్లెట్ దొరికింది. దీంతో గ్రామస్తులు వారిని పోలీసులకు అప్పగించారు. అంతకుముందు ఆ ఇద్దరు వ్యక్తులు చింతలూరులో కల్లు మండువా వద్ద కల్లు తాగి ఓ వ్యక్తిని నాటు తుపాకితో డబ్బుల కోసం బెదిరించగా గ్రామస్తులు వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా ద్విచక్ర వాహనంపై పారిపోయినట్లు తెలిసింది.
వారు నేరుగా రామోజీపేటకు వెళ్లి బిల్డింగ్ పని కోసం వచ్చిన ఉత్తరప్రదేశ్ కు చెందిన కార్మికుల వద్దకు వచ్చి అక్కడే తలదాచుకున్నట్లు సమాచారం. అయితే చింతలూరు గ్రామస్తులు రామోజీపేట గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో వారు గ్రామంలో తలదాచుకున్న ఇద్దరు అజ్ఞాత వ్యక్తులను పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. పోలీసులు పేరుకొని వారి వద్ద నుండి నాటు తుపాకిని బుల్లెట్టును స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తులు ఉత్తరప్రదేశ్ కు చెందిన వారని తెలిసింది. అయితే వారు ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? అసలు వారి దగ్గర తపంచ, బుల్లెట్లు ఎక్కడివి అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.