23-04-2025 01:53:41 AM
మంచుకొండల్లో ముష్కరమూక విరుచుకుపడింది. కుటుంబసభ్యులు, స్నేహి తులతో కలిసి మంగళవారం జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం వెళ్లిన పర్యాటకులపై బుల్లెట్ల వర్షం కురిపించింది. విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ౨౬ మంది పర్యాటకులు మృత్యువాత పడ్డారు. ఎంతోమంది గాయాల పాలయ్యారు. ఉగ్రవాదులు కేవలం హిందువులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.
హిందువులను పక్కకు రమ్మని మరీ ముష్కరులు దాడులకు తెగబడ్డారు. ‘మీ వల్లే మా మతం ప్రమాదంలో ఉంది’ అని ఉగ్రవాదులు తమతో అన్నట్టు బాధితులు పేర్కొన్నారు. కాల్పుల గురించి తెలుసుకున్న కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా కశ్మీర్‌కు చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు.
కాల్పుల ఘటనతో ప్రధాని మోదీ తన సౌదీ పర్యటనను రద్దు చేసుకుని భారత్‌కు తిరుగుపయనమయ్యారు. బుధవారం క్యాబినెట్ సెక్యూరిటీ కమిటీతో ప్రధాని భేటీ కానున్నారు. 2024 మే తర్వాత జమ్మూలో పర్యాటకులపై ఉగ్రదాడులు జరగలేదు. ఇటీవల పర్యాటకులపై జరిగిన అతిపెద్ద దాడి ఇదే.
జమ్మూలో ఉగ్రదాడి
అనంతనాగ్, ఏప్రిల్ 22: జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి పెట్రేగిపోయా రు. కొద్ది రోజుల నుంచి ప్రశాంతంగా ఉన్న జమ్మూలో మరోసారి అలజడి సృష్టించారు. ట్రెక్కింగ్‌కు వెళ్లిన పర్యాటకులే లక్ష్యంగా కాల్పులు జరిపి 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. ముష్కరుల దాడుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. మృతుల వివరాలను ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.
మినీ స్విట్జర్లాండ్‌గా పిలవబడుతున్న అనంతనాగ్ జిల్లాలోని పహల్గాం ప్రాంతంలో కాల్పులు జరిపి నరమేధం సృష్టించారు. బైసరన్ లోయ ప్రాంతంలో పర్యాటకులు ట్రెక్కింగ్ చేస్తుండగా.. ఒక్కసారి ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ ప్రాంతానికికాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకోవాలి. దీంతో పర్యాటకులు ఎటూ పారిపోలేక ప్రాణాలు కోల్పోయారు.
ఈ దాడి తమ పనే అని ‘ద రెసిస్టన్స్ ఫ్రంట్’ (టీఆర్‌ఎఫ్) ప్రకటించింది. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగింది. సైనికుల తరహా దుస్తుల్లో వచ్చిన టెర్రరిస్టుల గ్రూప్ పర్యాటకులపై అత్యంత సమీపం నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. రక్తమో డిన బైసరన్ లోయ పహల్గాం హిల్ స్టేషన్‌కు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. దాడి జరిగిన వెంటనే భద్రతా దళాలు ఆ ప్రాం తాన్ని జల్లెడ పట్టాయి.
సౌదీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ దాడి విషయం తెలుసుకుని హోం మంత్రి అమిత్‌షాకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే కశ్మీర్‌కు వెళ్లాలని షాకు సూచించారు. దీంతో అమిత్ షా హుటాహుటిన జమ్మూకు వెళ్లి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనేక మంది ఉగ్రదాడిని ఖండిస్తూ.. బాధితులకు బాసటగా నిలిచారు.
ఈ దాడి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా హెచ్చరించారు. ఈ దాడి విష యం తెలిసి ప్రధాని హుటాహుటిన తన సౌదీ పర్యటనను రద్దు చేసుకుని బయల్దేరా రు. నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన క్యాబినెట్ సెక్యూరిటీ కమిటీ భేటీ జరగనుంది. ఉగ్రవాదుల అరాచకాలు ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయి. కేవలం హిందువులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారని బాధితులు తెలిపారు.
హిందువుల కారణంగా తమ మతం ప్రమాదంలో ఉందని ఉగ్రవాదులు పేర్కొన్నట్టు బాధితులు తెలిపారు. ‘నా భర్తను చంపారు.. నన్నూ చంపే యండి. అని ఓ బాధితురాలు ఉగ్రవాదితో అనగా నేను నిన్ను చంపను వెళ్లి.. మీ మోదీ కి చెప్పుకో పో’ అని అన్నట్టు ఆ బాధితురాలు వాపోయారు. ఉగ్రదాడుల తర్వాత స్థానికులు సహాయం చేసినట్టు బాధితులు పేర్కొన్నారు.
2024 మే తర్వాత జమ్మూలో పర్యాటకుల మీద ఉగ్రదాడులు జరగలేదు. హైదరాబాద్‌లో ఉంటున్న మనీశ్ రంజన్ అనే వ్యక్తి కూడా ఈ ఉగ్రదాడిలో మరణించారు. మనీశ్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్షన్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మూడు రోజుల కిందటే కుటుంబంతో కలిసి వెళ్లిన మనీశ్ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో మరణించారు.
ఆరా తీసిన ప్రధాని మోదీ
సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధా ని మోదీ జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిపై హోం మంత్రి అమిత్‌షాకు ఫోన్ చేసి ఆరా తీశారు. అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, తక్షణమే ఘటనా స్థలానికి వెళ్లి పరి స్థితిని సమీక్షించాలని అమిత్‌షాకు సూచించారు.
దాడి జరిగిన వెంటనే హోం మంత్రి అమిత్‌షా ఉన్నతస్థాయి సమావేశం ఏర్పా టు చేశారు. ఈ సమావేశానికి హోం సెక్రటరీ, ఇంటలిజెన్స్ బ్యూరో సీనియర్ అధి కారులు హాజరయ్యారు. జమ్మూకశ్మీర్ డీజీ పీ, అధికారులు వర్చువల్‌గా పాల్గొన్నారు. ప్రధాని సూచనతో అమిత్‌షా అక్కడికి వెళ్లి.. క్షతగాత్రులను పరామర్శించారు.
ఉగ్రదాడి దిగ్భ్రాంతికరం: రాష్ట్రపతి
ఉగ్రదాడి దిగ్భ్రాంతిని కలిగించిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ‘పర్యాటకులపై జరిగిన దాడి ఎంతో దిగ్భ్రాం తిని కలిగించింది. ఇది ఒక అమానవీయ చర్య. దీన్ని తప్పకుండా ఖండించాలి. ఈ దాడిలో ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. గాయపడ్డ వారు త్వరగా కోలుకో వాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
భగవంతున్ని ప్రార్థిస్తున్నా: మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉగ్రదాడిని ఖండించారు. ‘జమ్ములో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తున్నా. ఈ దాడిలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలు కోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా. బాధితులకు అన్ని విధాలుగా సాయం చేస్తాం. ఈ దాడి వెనుక ఎవరున్నారో వారిని వదిలే ప్రసక్తే లేదు. ఉగ్రవాదంపై మా ప్రభుత్వ పోరాటం కొనసాగుతుంది’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
వదిలే ప్రసక్తే లేదు: అమిత్‌షా
పర్యాటకులపై దాడిని హోం మంత్రి అమిత్‌షా తీవ్రంగా ఖండించారు. ‘ఈ దాడి తీవ్రంగా బాధించింది. ఇందులో పాల్గొన్న ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ప్రధాని మోదీకి ఘటన గురించి పూర్తిగా వివరించా. భద్రతా సమీక్ష కోసం శ్రీనగర్ వెళ్తున్నా’ అని షా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ దాడి హేయమైన చర్య అని జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ‘నేను ఇది నమ్మలేకపోయా.
పర్యాటకులపై దాడి హేయమైన చర్య. దాడికి పాల్పడిన వారు మానవ మృగాలు. ఘటనను ఖండించేందుకు మాటలు రావడం లేదు’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. తీవ్రదిగ్భ్రాంతికి గురైనట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవం తున్ని ప్రార్థించారు. విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కూడా దాడిని ఖండించారు.
దాడిని ఖండించిన ట్రంప్, వాన్స్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జమ్మూకశ్మీర్ ఉగ్రదాడిని ఖండించారు. ‘ఉగ్రదాడి కలిచివేసింది. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలి. మోదీకి, భారతీయులకు మా పూర్తి మద్దతు ఉంటుంది. మీకు మా ప్రగాఢ సంతాపం’ అని పేర్కొన్నారు. భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఉగ్రదాడిని ఖండించారు.
వేదనకు గురి చేసింది: కిషన్‌రెడ్డి
ఉగ్రదాడిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ‘భయంకరమైన ఉగ్రదాడిలో సామాన్య పౌరులు చనిపోవడం మనోవేదనకు గురి చేసింది. ఈ అమానవీయ చర్య ఏ మాత్రం సమర్థనీయం కాదు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
దాడిని ఖండించిన కేసీఆర్
ఉగ్రదాడిపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో పాటు కేటీఆర్, హరీశ్‌రావు, కవిత దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వారి కుటుంబాలకు సంతా పం ప్రకటించారు. టెర్రరిస్టులపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
భేల్ పూరీ తింటుంటే.. చంపేశారు
‘నేను నా భర్త కలిసి భేల్ పూరీ తిం టున్నాం. అంతలోనే ఓ ముష్కరుడు నా భర్త ప్రాణం తీశాడు’ అని ఓ బాధితురాలు కన్నీటి పర్యంతమయ్యారు. బాధితుల్లో కర్ణాటకకు చెందిన వారు ఉండటం కలిచి వేసిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. విషయం తెలియగానే ఉన్నతాదికారులతో సమావేశం నిర్వహించినట్టు ఆయన వెల్లడించారు. కన్నడ బాధితులకు కర్ణాటక ప్రభుత్వం పూర్తి సహాయం చేస్తుందన్నారు.
దాడి చేసింది మేమే..
ఈ దాడి తమ పనే అంటూ పాక్ కేంద్రంగా పని చేస్తున్న లష్కరే తోయిబా తోక సంస్థ అయిన ‘ద రెసిస్టన్స్ ఫ్రంట్’ తెలిపింది. ఈ ఉగ్రసంస్థ ఆర్టికల్ 370 రద్దు తర్వాత కొత్తగా పుట్టుకొచ్చింది. ఈ సంస్థకు ఉగ్రవాది షేక్ సాజిద్ గుల్ సుప్రీం కమాండర్‌గా, బాసిత్ అహ్మద్ దార్ చీఫ్ ఆపరేషనల్ కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు. 2023లోనే కేంద్ర హోం శాఖ ఈ సంస్థను ఉగ్రసంస్థగా ప్రకటిస్తూ గెజిట్ జారీ చేసింది.
దొంగదెబ్బతో ఆత్మస్థుర్యైం దెబ్బతీయలేరు: రేవంత్‌రెడ్డి
ఉగ్రవాదుల కాల్పుల్లో పర్యాటకులు మృతి చెందిన ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొ న్నారు. ‘ఇటువంటి దొంగ దెబ్బలతో భారతీయుల ఆత్మస్థుర్యైన్ని దెబ్బతీయలేరు. ఉగ్రమూకల విషయంలో అత్యంత కఠినగంగా వ్యవహారించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని, భగవంతుడిని ప్రార్థిస్తున్నా.’ అని ప్రకటన విడుదల చేశారు.