- మరణించిన వారికి 5 లక్షల ఎక్స్‌గ్రేషియా
- గల్ఫ్ కార్మికుల పిల్లలకు గురుకులాల్లో సీట్లు
- సమీక్షలో మంత్రి పొన్నం
హైదరాబాద్, సెప్టెంబర్ 14 (విజయ క్రాంతి): గల్ఫ్ కార్మికుల కోసం గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గల్ఫ్ కార్మికుల సం క్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, పీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్ ఆధ్వర్యంలో 5 అంశాలపై చర్చించారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమంపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఒక సలహా కమిటీని ఏర్పాటు చేయాలని, కమిటీలో గల్ఫ్ ప్రభావిత ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులను సభ్యులుగా నియమించేందుకు జీవో విడుదల చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ప్రజావాణిలో ఈ నెల 20వ తేదీ నుంచి గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక కౌంటర్ ప్రారంభిస్తామని తెలిపారు. గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో గల్ఫ్ కార్మికుల పిల్లలకు పది శాతం అడ్మిషన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 2023, డిసెంబర్ 7 నుంచి గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. గల్ఫ్ భీమా ఉండాలని విప్ ఆది శ్రీనివాస్ సూచించారు.
ఏజెన్సీల పేరుతో మోసం జరుగుతుందని అలా జరగకుండా కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. కేరళ గల్ఫ్ పాలసీని పరిశీలించాలని పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు కోరారు. సమావేశంలో ఎమ్మెల్యేలు డా.సంజయ్‌కుమార్, రేకులపల్లి భూపతిరెడ్డి, కేఆర్ నాగరాజు, మేడిపల్లి సత్యం, వాకిటీ శ్రీహరి ముదిరాజ్, సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్‌రెడ్డి, మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఇతర నాయకులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలి
శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా బీఆర్‌ఎస్ వ్యవహారిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే కుట్ర జరుగుతోందని, ఇటువంటి వారికి ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని పొన్నం హెచ్చరించారు. బీఆర్‌ఎస్ నేతలు ఒళ్లు దగ్గరపెట్టుకోని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఫిషరిస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయితో కలిసి మీడియాతో మాట్లాడుతూ అరికెపూడి గాంధీని పాడి కౌశిక్‌రెడ్డి రెచ్చగొట్టారని, అయితే ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులు మంచి పద్దతి కాదని అన్నారు.
ఆంధ్రోళ్లపై కౌశిక్‌రెడ్డి మాట్లాడిన వీడియోను కేటీఆర్‌కు పంపుతానని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వంపై ఇంత అసహనం ఎందుకు అని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఫిరాయింపులలను ప్రోత్సహించలేదని పేర్కొన్నారు. ఫిరాయంపుల్లో మాస్టర్ బీఆర్‌ఎస్సేనని, ఈ విషయంలో ఆ పార్టీ డాక్టరేట్ సాధించిందని పొన్నం ఎద్దేవా చేశారు. పార్టీకి రాజీనామా చేయని టీడీపీ వ్యక్తిని బీఆర్‌ఎస్‌లో చేర్చుకుని మంత్రి పదవిని ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వానికి అండగా నిలవాలనే ఉద్దేశ్యంతోనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తుంటే వారిపై బురద జల్లుతున్నారన్నారు. తమ ప్రభుత్వం ఏనాడు ప్రతిపక్షాల గొంతు నొక్కలేదని చెప్పారు.