calender_icon.png 23 October, 2024 | 6:57 AM

గల్ఫ్ బాధితులను రక్షించాలి

29-07-2024 12:44:15 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 28 (విజయక్రాంతి): గల్ఫ్ దేశాల్లో కాసులు సంపాదించి కష్టాలు తీర్చుకుందామని వెళ్లిన వారిలో అనేక మంది ఏజెంట్ల చేతిలో మోసపోయి దుర్భరమైన జీవితాలు గడుపుతు న్నారని గల్ఫ్ బాధితురాలు నిర్మల ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల పరిస్థితి మరీ దయనీయంగా ఉందన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ సేన జాతీయ అధ్యక్షుడు పెచ్చెట్టి మురళీ రామకృష్ణతో పాటు బాధితురాలు నిర్మల ఆదివారం మీడియా సమా వేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ.. అమలాపురం సమీపంలోని గొల్ల కుట్టివారిపాలెంకు చెందిన తాను.. తణుకుకు చెందిన సంజయ్ అనే ఏజెంట్ ద్వారా రెండేళ్ల క్రితం ఒమన్ రాజధాని మస్కట్‌కు క్లీనింగ్, పిల్లలను చూసు కునే పనిమీద వెళ్లినట్టు తెలిపారు.

అక్కడ మొదటి రెండు నెలలు బాగానే ఉన్నప్పటికీ, ఆ తర్వాత నుంచి యజమానుల అఘాయిత్యాలు పెరిగిపోయాయని, కాలు విరిగి ఉన్న తనకు ఆసుపత్రిలో చూపించాలని వేడుకున్నా.. తనను కొట్టి పని చేయిం చుకున్నారని తెలిపింది. తనలా ఇబ్బందులకు గురవుతున్న చాలామందిని కాపా డాలని ఆమె కోరారు. అనంతరం మురళీ రామకృష్ణ మాట్లాడుతూ.. బతుకుదెరువు కోసం పొట్ట చేతపట్టుకొని గల్ఫ్ దేశాలకు వెళ్లిన చాలామంది మోసపోతున్నారని అన్నారు. వారి పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలో తెలియని నిస్సహాయక స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. నిర్మలను కాపాడడం తనకు సంతృప్తి కలిగించిందని పేర్కొన్నారు. మరో 15 మందిని కాపాడి ఇండియాకు తీసుకురావడానికి ప్రభుత్వ సహకారం కోరుతున్నట్టు తెలిపారు.