calender_icon.png 6 November, 2024 | 3:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గల్ఫ్ ఏజెంట్ మోసం

06-11-2024 01:16:23 PM

యూరప్ కు పంపిస్తానని కజకిస్తాన్ కు పంపించిన ఏజెంట్

ఇచ్చిన డబ్బులు అడిగితే పట్టించుకోని గల్ఫ్ ఏజెంట్

ఆందోళనకు గురై గుండెపోటుతో మృతి

నిజామాబాద్ (విజయక్రాంతి): ఒక గల్ఫ్ ఏజెంట్ చేసిన మోసంతో కలత చెంది ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో బుధవారం వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఆర్మూర్ కు చెందిన రాజేష్ లాల్ (55) అనే వ్యాపారి తన కుమారుడు సృజన్ ను యూరప్ దేశానికి పంపించడానికి ఆర్మూర్ కు చెందిన గల్ఫ్ ఏజెంటు ప్రసాదును సంప్రదించాడు. 10 లక్షలు చెల్లిస్తే పంపిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. వ్యాపారి రాజేష్ లాల్ గల్ఫ్ ఏజెంట్ ప్రసాద్ కు 10 లక్షలు చెల్లించారు.

రాజేష్ లాల్ కుమారుడు సృజన్ ను యూరప్ పంపించకుండా ఖాజాకిస్థాన్ కు పంపించాడు. సృజన్ ఇంటికి తిరిగి వచ్చి గల్ఫ్ ఏజెంటు ప్రసాదు ఇంటికి బుధవారం ఉదయం తండ్రి కొడుకులు వెళ్లి ప్రశ్నించారు. గల్ఫ్ ఏజెంట్ డబ్బుల విషయంలో స్పందించకపోవడంతో రాజేష్ లాల్ మనస్థాపానికి గురయ్యాడు. ఇంటికి రాగానే గుండెపోటుతో రాజేష్ లాల్ మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు రాజేష్ లాల్ మృతదేహాన్ని గల్ఫ్ ఏజెంట్ ప్రసాద్ ఇంటి ఎదుటకు తీసుకెళ్లి అక్కడ పెట్టి నిరసన వ్యక్తం చేశారు. గల్ఫ్ ఏజెంట్ ప్రసాద్ చేసిన అన్యాయానికి తమ నాన్న గుండెపోటుతో మృతి చెందాడని మృతుని కుమారుడు సృజన్ కుటుంబ సభ్యులు వాపోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి వారికి నచ్చజెప్పారు.