calender_icon.png 2 November, 2024 | 12:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలోనే గుజరాత్ తరహా ల్యాండ్ గ్రాబింగ్ చట్టం

16-07-2024 12:53:59 AM

సచివాలయంలో శ్వేత పత్రం విడుదల చేసిన ఏపీ సీఎం

హైదరాబాద్, జూలై 15(విజయక్రాంతి): భూ కబ్జాలకు అడ్డుకట్ట వేసేందుకు గుజరాత్ తరహాలో ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని తీసుకొస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సహజ వనరుల దోపిడీపై ఆయన సోమవారం సచివాలయంలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంలో భూములు ఖనిజాలు, అటవీ సంపదను దోచివేశారని, వైసీపీ నాయకులు విశాఖ, ఒంగోలు, చిత్తూరులలో భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. 23 పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని, అసైన్డ్ భూములను కొట్టేశారని, ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో భూ దోపిడీకి కుట్ర పన్నారని మండిపడ్డారు.

విశాఖలోని రామనాయుడు స్టూడియో భూములను కొట్టేసేందుకు విఫలయత్నం చేశారని, వృద్ధాశ్రమానికి ఇచ్చిన హయగ్రీవ ల్యాండ్స్‌ను కూడా ఆక్రమించారని మండిపడ్డారు. మాజీ ఎంపీ ఎంవీవీ అనేక భూ అక్రమాలకు పాల్పడ్డారని, ఒంగోలులో నకిలీ పత్రాలు సృష్టించి రూ.101 కోట్ల విలువజేసే భూమి కాజేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.  చిత్తూరులో 782 ఎకరాలు కాజేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. పుంగనూరులో 982 ఎకరాల అసైన్డ్ భూమిని పేద వారి నుంచి లాక్కున్నారన్నారు. గ్రామాల్లో ఉండే భూములను ఆక్రమించుకొని, నివాస యోగ్యం కాని భూములను ఇళ్లకు కేటాయించారన్నారు. గత ప్రభుత్వం 13,800 ఎకరాలను వైసీపీ నేతలకు దారాదత్తం చేసిందన్నారు.

భూ హక్కు పత్రం పేరుతో ప్రచారానికి రూ.13 కోట్లు ఖర్చు చేశారని, భూముల రీ సర్వే పేరుతో పాసుపుస్తకాలపై జగన్ చిత్రం ముద్రించుకున్నా రన్నారు.  వైసీపీ నేతలు నిబంధనలు ఉల్లంఘించి గనులు తవ్వేశారని, అధికారులను డిప్యుటేషన్‌పై తెచ్చుకుని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇసుక దందాలో రూ.9750 కోట్లు దోచుకున్నారని, ప్రశ్నించే వారిపై అట్రాసిటీ కేసులు పెట్టారన్నారు.  

నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. విభజన సమస్యలు పరిష్కరించాలని అమిత్‌షాను కోరనున్నారు. ఇరువురు నేతల మధ్య రాజకీయ అంశాలపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.