calender_icon.png 19 March, 2025 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుస్సాడి సంప్రదాయానికి గిన్నిస్ బుక్ లో స్థానం గర్వకారణం

18-03-2025 08:08:05 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆదివాసి, గిరిజన సంప్రదాయమైన గుస్సాడీలో జాతీయస్థాయిలో రాణించి జిల్లాకు వన్నె తేవడమే కాకుండా గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించడం గర్వకారణం అని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టర్ భవన సమావేశ మందిరంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని తిర్యాణి మండలం దంతన్ పల్లి గ్రామానికి చెందిన భీమయ్య కోలం గుస్సాడీ బృందానికి ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ-ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి రమాదేవి, గిరిజన సంఘాల నాయకులతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... భారత ప్రభుత్వం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దేశ వ్యాప్తంగా దేశ రాజధాని ఢిల్లీలో 5 వేల మంది కళాకారులతో నిర్వహించిన గుస్సాడీ ప్రదర్శనలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జయతి జయమమ భారత్ గుస్సాడీ కార్యక్రమంలో దంతన్ పల్లి పి. వి. టి. జి. కోలం గుస్సాడీ బృందం అందించిన ప్రదర్శనతో రికార్డ్ సృష్టించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో స్థానం సంపాదించడం గర్వంగా ఉందని అన్నారు. గిరిజన ఆచారాలను, సంస్కృతి సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించాలని అన్నారు. గిరిజన యువత సంస్కృతి, విద్య, క్రీడా రంగాలతో పాటు అన్ని రంగాలలో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం గుస్సాడీ బృంద సభ్యులను శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, గిరిజన సంఘాల నాయకులు సిడాం అర్జు, ఆత్రం గంగారం, మడావి భీమ్రావు, కుర్సింగ మూతిరామ్, ఆత్రం సంతోష్, చాహకటి దసరా తదితరులు పాల్గొన్నారు.